సిద్దిపేట, ఏప్రిల్ 20: సిద్దిపేట వేదికగా జరిగిన సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీలో ఎంసీసీ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎంసీసీ నాలుగు వికెట్ల తేడాతో ముండ్రాయి జట్టుపై గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముండ్రాయి నిర్ణీత 10 ఓవర్లలో 85 పరుగులు చేసింది. 86 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఎంసీసీ 9.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో సిద్దిపేట నుంచి మరింత మంది ప్లేయర్లు హైదరాబాద్ రంజీ జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, సినీ హీరో సుమన్ తదితరులు పాల్గొన్నారు. విజేత ఎంసీసీ జట్టుకు రూ.లక్ష, రన్నరప్‌గా నిలిచిన ముండ్రాయి టీమ్‌కు రూ.50 వేలు అందజేశారు.