రెండు దశాబ్దాల క్రితం ఆయనిచ్చిన ఒక్క పిలుపునకు డొక్కలకు గంజిలేకపోయినా.. పంతం పట్టి నెగ్గడం కోసం యావత్తు తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టింది. తెలంగాణ ఒక అగ్నిబాణమై వలసపాలనను నేలగూల్చింది. గెలిచిన తెలంగాణకు పాలకుడైన ఆయన దార్శనికతకు యావత్‌దేశం ఇవాళ మోకరిల్లుతున్నది. ఒకప్పుడు తెలంగాణ పేరే వినిపించని పరిస్థితులనుంచి ఇప్పుడు ఆసేతు హిమాచలం తెలంగాణ మంత్రమే పఠించేలా చేసిన ద్రష్ట. సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపొడిచి.. దోస్తుల కోసం దోపిడీ పాలన సాగిస్తున్న వారిపై రణభేరి మోగించిన ధీరోదాత్తుడి వెంట దేశమంతా కదలివస్తున్నది. రాజకీయాలు, అధికార అహంభావాలకు అతీతంగా.. తన జాతి కోసం.. తన దేశం కోసం నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిగ్గదీయగలిగిన నేత.. ఆయనది పరిణతి గల వ్యవహారశైలి.. నిర్మాణాత్మకమైన ఆలోచనావిధానం.. ఆయన కార్యదక్షత.. దేశానికి మార్గదర్శనం. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. తెలంగాణ భాగ్యవిధాత. 68 వసంతాల ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని తెలంగాణ సమాజం పర్వదినంలా ఘనంగా జరుపుకొన్నది. తెలంగాణ ఎల్లలు దాటి.. అనేక రాష్ర్టాల్లో సంబురాలు మిన్నంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. విదేశాల్లోని ఎంతోమంది తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకొన్నారు. సర్వమత ప్రార్థనలు చేశారు, దుస్తుల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానం చేశారు. మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
మెల్బోర్న్లో 15 వేల అడుగుల ఎత్తు నుంచి ైస్కె డైవ్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే కేసీఆర్’ అని వినయ్ సన్నీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గాల్లో తేలియాడుతూ సీఎం కేసీఆర్ ఫోటోను చేతిలో పట్టుకొని వినయ్ గౌడ్ వినూత్నంగా బర్త్‌డే విషెష్ చెప్పారు. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్‌కోస్ట్, బెండీగో, బల్లారాట్లో సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో రాజేశ్ రాపోలు, ప్రవీణ్‌రెడ్డి, రవియాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, సాయిరాం ఉప్పు, రవి సాయల, సంతోష్, వినోద్, చైతన్య, అనూప్ తదితరులు పాల్గొన్నారు. లండన్‌లోనూ టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రతినిధులతో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకుడు అబుజాఫర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి కేసీఆర్ బాగుండాలని అల్లాని ప్రార్థించానని, అన్ని మతాల ప్రజల ఆశీస్సులు కేసీఆర్‌కు ఉన్నాయని అన్నారు. యూకే ఎన్నారై ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, యూకే ఎన్నారై ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్ ఖాజా, ఇతర నాయకులు నవీన్‌రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరిగౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మలేషియాలో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోంలో చిన్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. చిల్డ్రన్ వెల్ఫేర్ హోంకు రూ.10 వేల సహాయం అందించారు. కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు చిరుత చిట్టబాబు, ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునగాల అరుణ్, బోయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేశ్ గౌరు, సందీప్ కుమార్ పాల్గొన్నారు.

68 కిలోమీటర్ల సైకిల్ రైడ్ చేసిన తండ్రీ కొడుకులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ఈ తండ్రీ కొడుకులు. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన శ్రీనివాసరాజు తన కొడుకు శ్రీహర్షరామరాజుతో కలిసి 68 కిలోమీటర్ల సైకిల్ రైడ్ నిర్వహించారు. అల్వాల్ నుంచి గజ్వేల్ వరకు సైకిల్‌రైడ్ కొనసాగింది. గురువారం ఉదయం 5 గంటలకే సైకిల్ రైడ్ ప్రారంభించడం విశేషం. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ లాంటి భారీ రిజర్వాయర్లను నిర్మించి తెలంగాణలో భూగర్భ జలసిరులను పెంపొందించినందుకు కృతజ్ఞతగా సైకిల్‌రైడ్ చేపట్టినట్టు శ్రీనివాసరాజు చెప్పారు. రామరాజు శామీర్‌పేట మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుండగా ఆయన కొడుకు మల్లారెడ్డి వర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మిషిన్ లర్నింగ్ కోర్సు చదువుతున్నారు.