
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఆవశ్యకతను, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధాన లేమిని, ఢిల్లీ పెద్దల ముందుచూపులేని తనాన్ని, వారి అవగాహనా రాహిత్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు బయటపెట్టారు. అనేక వేదికలపై కేంద్రం లోపభూయిష్టమైన వైఖరిని ప్రశ్నించారు. కేంద్రానికి వ్యవసాయ విధానం అంటూ లేనేలేదని, అంతా డొల్ల వ్యవహారమని కేసీఆర్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అది ఈ రోజు నిజమైంది. కేంద్ర వ్యవసాయ విధాన లోపాలపై వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.
ఈ దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
కానీ ఇందులో దేశం మొత్తం వాడుకొనేది 35 వేల నుంచి 36 వేల టీఎంసీలు కూడా లేదు. ఇంకో 30 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. చాట్ల తవుడు పెట్టి కుక్కలకు కొట్లాట పెట్టినట్లు.. రాష్ర్టాల మధ్య తగువులు పెట్టి నీళ్లు ఇవ్వకుండా మొత్తం దేశాన్ని, రైతాంగాన్ని అల్లల్లాడిస్తున్నారు. దేశం లో ఉండే వ్యవసాయ భూమి మొత్తం 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరానికీ నీళ్లు ఇచ్చినా ఇంకా 25 వేల టీఎంసీలు మిగిలే ఉంటాయి. ఇది చేసే తెలివితేటలు లేవు. దీనికి పరిష్కార మార్గాలు చూపే సంస్కృతి, ఆ ఆలోచన, ఆ మేధావితనం కేంద్రానికి లేదు.-18, నవంబర్, మహాధర్నా, ఇందిరాపార్కు..
రానున్న రోజుల్లో తప్పకుండా దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. ఈ దేశం ఎటు పోతా ఉన్నదో, ఏం జరుగుతా ఉన్నదో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉన్నది. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉంటే.. ఏ రోజు కూడా 2 లక్షల మెగావాట్లకు మించి వాడుకోవడం లేదు. మన రాష్ర్టాన్ని పక్కన పెడితే, ఏ ఒక్క రాష్ట్రంలోనూ 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు. రైతులకు ఇవ్వరు. పరిశ్రమలకు ఇవ్వరు.. కమర్షియల్‌కు ఇవ్వరు.. దేనికీ ఇవ్వరు. దీనికి కారణం ఎవరు? ఎవరి చేతకానితనం? ఎవరి అసమర్థత? ఎవరి విధానాల ఫలితం?- 18, నవంబర్, మహాధర్నా, ఇందిరాపార్కు..
ఈ గోలుగుండం గాళ్లకు, కరెంటు ఉన్నా వాడలేని అసమర్థులకు, దేశంలో నీళ్లున్నా ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడితేనే ఈ దేశానికి నిష్కృతి లభిస్తుంది. కచ్చితంగా జెండా లేవాల్సిందే, దేశవ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. దీనికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందే, మరో పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాల్సిందే. -18, నవంబర్, మహాధర్నా..
సన్న వడ్లకు మద్దతు ధరకన్నా నూరో యాభయ్యో ఎక్కువ ఇద్దామంటే కూడా కేంద్రం ఇయ్యనియ్యడంలేదు. ఒక వేళ ఎక్కువ ధర ఇస్తే మొత్తం వడ్లనే కొనడం బంద్ చేస్తామని చెప్పింది. ఎఫ్‌సీఐ దీనిపై రాష్ర్టానికి లేఖ రాసింది. కొన్ని దేశాలు రైతులకు సబ్సిడీలిస్తాయి. కానీ మన దేశంలో అవి కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానంటే కూడా కేంద్రం ఇవ్వనివ్వదు. – అక్టోబరు 31, 2020, జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా..
రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్రం ఎన్నో ఒత్తిళ్లు పెడుతున్నది. ప్రతి బాయికాడ కరెంటు మీటరు పెట్టాలని అంటున్నరు. వద్దని నేనే రెండేండ్ల నుంచి పోరాడుతున్న. రాష్ర్టానికి వచ్చే రుణాలను బంద్ చేస్తమని బ్లాక్ మొయిల్ చేస్తున్నరు. ఓపిక పట్టినం. ఇకపై కచ్చితంగా కేంద్రం ఎంబడి పడుతం. రైతులను మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నం. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ల బతుకులను ఆగం చేస్తమంటే ఒప్పుకోం.-నవంబర్ 8, 2021, ప్రగతిభవన్‌లో మీడియాతో..
దేశంలో కోట్ల మంది రైతులున్నారు.. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.. ప్రకృతి ప్రసాదించిన జీవనదులున్నాయి.. అద్భుతమైన సైంటిస్ట్‌లు ఉన్నారు.. 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి.. దేశంలోని సగం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నది. అయినా భారత్ ఆకలిరాజ్యంగా మిగిలిపోతున్నది. వ్యవసాయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కేంద్రం పాలసీ ఏమిటి? – 18, నవంబర్, మహాధర్నా, ఇందిరాపార్కు..