హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర వ్యవసాయ విధానాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రైతు ఉద్యమానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. ఇది జరిగిన మరుసటిరోజే కేంద్రం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొన్నది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు..
మీ దుర్మార్గమైన చట్టాల కింద నలిగిపోవాల్నా, నాశనం కావాల్నా? కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైపోయాయి. ఢిల్లీ రాజధానిలో ఏడాది కాలంగా లక్షల మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడం లేదు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్రమే కార్లు ఎక్కించి చంపుతున్నది. మొత్తం ప్రైవేట్‌పరం చేస్తాం.. మార్కెట్లను రద్దు చేస్తామంటున్నది. అవసరం అనుకొంటే.. తప్పదూ అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రైతాంగ సమస్యల కోసం తానే లీడర్షిప్ తీసుకుంటుంది. మీ మెడలు గ్యారంటీగా వంచుతుంది. మీ కుటిల నీతి.. మీ దుర్మార్గమైన విధానాలు, మీ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చివరి రక్తపు బొట్టదాకా పోరాటం చేస్తాం తప్ప మిమ్ములను వదిలిపెట్టం.-18, నవంబర్, మహాధర్నా, ఇందిరాపార్కు..
కేంద్ర ప్రభుత్వం గూండాగిరి చేసి పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను ఆమోదించుకొన్నది. రాజ్యసభలో మెజారిటీ లేకున్నా.. ఎంపీలు ఓటింగ్ పెట్టాలని కోరినా వినలేదు. ఓట్లు కూడా వేయకుండా బిల్లు పాసైనట్లు చైర్మన్ ప్రకటించారు. ఘోరమైన మోసాలు చేస్తరు. వాళ్లకు కావాల్సింది ఓటు. మనిషి కాదు. వాళ్ల పథకాల్లో మనిషి లేడు. జీవితం లేదు. గుండెలో తడి లేదు. హృదయంలో నిజమైన ప్రేమ లేదు. కావాల్సింది ఓటు అంతే. మనం ప్రమాదంలో ఉన్నాం. ఇంత కంఠశోష ఎందుకు చెప్తున్నా అంటే, కొత్త వ్యవసాయ బిల్లు పర్యవసానం ఏంటి? ఉత్తర భారత్ ఉడుకుతున్నది. పంజాబ్ రైతాంగం రోడ్డు మీదున్నది? దసరా నాడు రావణుడి బదులు మోదీ బొమ్మను కాలబెట్టిండ్రు. – అక్టోబర్ 31, 2020, జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా..
ఇంతకు ముందు మార్కెట్ కమిటీ ఉండె.. నిబంధన ఉండె.. ఇప్పుడు మార్కెట్ కమిటీ తీసేసిన్రు. లైసెన్స్‌లు లేవు. ఎవ్వడు పడితే వాడు యాడపడితే ఆడ కొనొచ్చు. ఎంతంటే అంత నిల్వ పెట్టుకోవచ్చు. ఆడిగేటోడు లేడు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టంతో పెద్ద ప్రమాదం వచ్చింది ఇప్పుడు. రైతు పండించిన పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తున్నరు. అమ్ముకొంటడా రైతు.. ఉన్న మార్కెట్లో అమ్ముదామంటేనే ఆగమాగం ఉందంటే. నువ్వు యాడైనా అమ్ముకోవచ్చంటే తెలంగాణ రైతు పోయి ఢిల్లీలో అమ్ముతడా? ట్రాన్స్పోర్ట్, లారీ చార్జీ ఎంతైతది? బిల్లు ముసుగులో పెద్ద పెద్ద వ్యాపారులు, కార్పొరేట్ గద్దలు లాభపడుతాయి. – అక్టోబర్ 31, 2020, జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా..
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. వారికి అందరూ మద్దతుగా నిలువాలి. రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేదాకా పోరాటం కొనసాగించాలి. – డిసెంబర్ 6, 2020, భారత్ బంద్‌కు మద్దతుగా సీఎం కేసీఆర్
ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? బిల్లులతో రైతులు పూర్తిగా దెబ్బతింటారు. ప్రైవేటు వ్యాపారులకు తలుపులు బార్లా తెరుస్తున్నారు. రైతులను దెబ్బతీసి, కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లులను గట్టిగా వ్యతిరేకించాలి.– సెప్టెంబర్ 19, 2020, టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్
ఢిల్లీలో సంవత్సరకాలంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ రైతులు సమ్మె చేస్తున్నారు. సుమారు 600 మందికి పైగా రైతులు ప్రాణాలు విడిచారు. అయినా కేంద్రం మొండి వైఖరి వీడలేదు. – నవంబర్ 8, 2021, ప్రగతిభవన్‌లో మీడియాతో..
మొదట్నుంచీ బీజేపీ రైతుకు వ్యతిరేకంగా పోతున్నది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తున్నది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాది నుంచి ఢిల్లీలో ఉద్యమాలు చేస్తుంటే, కేంద్ర మంత్రులు రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నరు. బీజేపీలోని సీఎం స్థాయి వ్యక్తులే రైతులను కొట్టాలని క్యాడర్‌ను రెచ్చగొడుతున్నరు. రైతులను తొక్కించైనా అణచివేసే పరిస్థితిలో ఉన్నరు. – నవంబర్ 7, 2021, ప్రగతిభవన్లోమీడియాతో..
పదవిలో ఉన్న పాలకుల కన్నా ప్రజాశక్తే ఎంతో గొప్పది. భారత రైతాంగం మరోసారి ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటిచెప్పింది. రైతులు అవిశ్రాంత పోరాటం ద్వారా తమ డిమాండ్లను సాధించుకోవడం సంతోషకరం. రైతాంగం, రైతాంగం పోరాటాల వెంటే టీఆర్ఎస్ ఉంటుంది. జై కిసాన్.. జై జవాన్.- కే తారకరామారావు, ఐటీశాఖ మంత్రి
నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని మోదీ ప్రకటించడం రైతుల విజయం. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి, రైతు శక్తిని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారు. ఏడాదిగా బుల్లెట్లకు, లాఠీలకు, జలఫిరంగులకు పోలీస్ కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి, రైతులు విజయం సాధించిన తీరు అద్భుతం. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలురులందరికీ ఉద్యమాభివందనాలు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ధర్నా చేశారు. యాసంగి వడ్లన్నీ కేంద్రం కొంటుందో లేదో చెప్పాలి. వానకాలం ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి
ఇది అన్నదాతల చారిత్రక విజయం. కేంద్రం ఈ చట్టాలను తెచ్చినప్పుడే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందిరాపార్క్ మహాధర్నాలో కూడా రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ మరోసారి ప్రకటించారు. -మహమూద్‌అలీ, హోంశాఖ మంత్రి
బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధించిన రైతులకు అభినందనలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా రైతులను ఏకం చేసేందుకు సీఎం కేసీఆర్ మహాధర్నాతో శ్రీకారం చుట్టడంతో కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయరంగం పట్ల పూర్తి అవగాహన కలిగిన నాయకుడు కేసీఆర్. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలి.- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ఇది అన్నదాతల విజయం. వారికి అభినందనలు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. రైతులకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుంది. వారి కోసం నిరంతరం పోరాడుతుంది.- ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి