అంబేద్కర్ కోనసీమ జిల్లా : భారీ వర్షంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరంలో బాధితులను జగన్ కలుసుకున్నారు. జీ పెదపూడి గ్రామానికి చేరగానే భారీ వర్షం ప్రారంభమైంది. అయినప్పటికీ సీఎం ముందుకే వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. లంక గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల నుంచి సాయం అందుతుందా? అని వారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు. రాత్రికి రాజమండ్రిలోనే బస చేస్తారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నట్లు అధికారులు సమాచారమిచ్చారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన లంక గ్రామాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఒకవైపు జోరుగా వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ట్రాక్టర్లోనే వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. తానున్నానంటూ వారికి భరోసా ఇస్తున్నారు. పుచ్చకాయలవారిపేట చేరుకుని అక్కడి వరద బాధితులతో మాట్లాడారు. ఈ గ్రామంలో నక్కా విజయలక్ష్మి కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం అరిగెలవారిపేట, ఉద్ముడి లంకలో బాధితులను కలుసుకుని వారిని పరామర్శించారు. అరిగెలవారిపేటలో వంతెన నిర్మిస్తానని అక్కడి వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి పీ గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి, తర్వాత మేకలపాలెం మండలం రాజోలులో వరద బాధితులతో సమావేశమయ్యారు.
వరద బాధితులందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పలువురు బాధితులతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. బాధితులకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలని, బాధితులను ఆదుకునేందుకు అధికారులకు సమయం ఇవ్వాల్సి ఉన్నందునే ఆలస్యంగా ప్రభావిత ప్రాంతాలకు వచ్చానని సీఎం జగన్ అన్నారు. బాధితులందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వపరంగా సాయం ఎలా అందుతున్నది? వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు? అనే విషయాలను స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు.