అమరావతి : హైదరాబాద్‌లోన గుల్జార్‌హౌజ్ అగ్నిప్రమాదంలో (Gulzar House fire incident) మొత్తం 17 మంది మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు( Chandra Babu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం, దిగ్భ్రాంతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
ఆదివారం తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar House) భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని మలక్‌పేట యశోద, హైదర్‌గూడ అపోలో, డీఆర్డీఎల్ అపోలో, ఉస్మానియా, నాంపల్లి కేర్ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మృతులు..
అగ్నిప్రమాదంలో మరణించినవారిని ఆరుషి జైన్ (17), షీతల్ జైన్ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్ (13), అభిషేక్ మోడీ (30), రాజేంద్ర కుమార్ (67), ఇరాజ్ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్ (36), వర్ష (35), రజని అగర్వాల్ (32), రిషభ్ (4), ప్రీతం అగర్వాల్ (1)గా గుర్తించారు.