హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)అలైన్మెంట్ మార్పు, నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదలచేశారు. రైతులతో మాట్లాడకుండా, గ్రామసభలు నిర్వహించకుండా, భూసేకరణలో స్పష్టతలేకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నిస్తే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించా రు.
8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కోసం 100 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని హెచ్ఎండీఏ మొదట నోటిఫికేషన్ ఇచ్చిందని, దాన్ని మార్చి రెండోసారి, మళ్లీ మూడోసారి అలైన్మెంట్ను విడుదల చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్టు జాన్వెస్లీ తెలిపారు.