సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులలోనే కాదు.. శివారు ప్రాంతాలలోని కాలనీలు, అంతర్గత రోడ్లపై ఉన్న చౌరస్తాలలో కూడా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఈ ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు కనీసం ఆయా ప్రాంతాలలో ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కన్పించడం లేదంటూ సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనైనా ఉండాల్సిన సిబ్బంది అటూ వైపు కూడా చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కార్యాలయాలు ప్రారంభం, ముగింపు సమయాలలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రోజురోజుకూ కొత్త కాలనీలు వెలుస్తుండడం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారు శివారు ప్రాంతాలలోనే ఎక్కువ నివాసాలు ఏర్పాటు చేసుకుంటుండడంతో జనాభా కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రధాన రహదారులే కాకుండా, కాలనీలు, బస్తీలలోని రోడ్లలోను ఓ మోస్తారు వ్యాపార సంస్థలు వెలిశాయి. దీంతో ట్రాఫిక్ కూడా పెరుగుతూ వస్తోంది.
అయితే ఇందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాన రోడ్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ, అంతర్గతంగా ఉండే రోడ్లపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు రోడ్లపై పోలీసులు కన్పించకపోవడంతో మండిపడుతున్నారు. సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మీర్పేట్, బాలాపూర్, ఉప్పల్, చర్లపల్లి, చంగిచర్ల, మల్కాజిగిరి, శామీర్‌పేట్, కొంపల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ఇలా ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు మధ్య ఉండే ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది.
కనీసం రద్దీ సమయాలలోనైనా..!
ప్రధాన రహదారులపై రద్దీ సమయాలలో సిబ్బంది తప్పకుండా ఉండాల్సిన అవసరముంది. అలాగని అంతర్గతంగా ఉన్న ప్రధాన కూడళ్లను విస్మరించడం కూడా ప్రజలను ఇబ్బందులోకి నెట్టడమే అవుతుంది. ట్రాఫిక్ సిబ్బంది మేం ప్రధాన రహదారులపై ఉన్నామని చెబుతున్నారే కాని.. అంతర్గత రహదారుల్లో ఏర్పడుతున్న సమస్యను పరిష్కరించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ట్రాఫిక్ పోలీసులు కొద్దిసేపున్నా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూసుకునే అవకాశముంది. అయితే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కువగా ప్రధాన రోడ్లపైనే పర్యటిస్తుండడంతో అక్కడే ఎక్కువ సబ్బందిని నియమిస్తూ, అంతర్గత రోడ్లను స్థానికంగా ఉండే ట్రాఫిక్ పోలీసులు విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం ఒక గంట పాటు సమయం వెచ్చిసే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరమయ్యే అవకాశాలున్నాయని ప్రజలు సూచిస్తున్నారు. రద్దీ సమయాలు, అత్యవసర పరిస్థితులలోనైనా పోలీసులు స్పందించాల్సిన అవసరముందని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
అంతటా ఇదే పరిస్థితి..
అన్ని శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుందని, ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను అంచనా వేస్తూ స్థానికంగా ఉండే ట్రాఫిక్ పోలీసులు కనీస చర్యలు చేపడుతూ వెళ్లాల్సి ఉన్నా, సమస్యలు పెద్దవయ్యే వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఈ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు లేరంటూ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సామాన్య ప్రజల కష్టాలను గుర్తించి, ఇలాంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.