పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 21 : పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అసౌకర్యాలు, అపరిశుభ్రతకు నిలయమైంది. ఆహ్లాదంగా ఉండాల్సిన కళాశాల ఆవరణ అధ్వానంగా మారింది. వర్షం వస్తే ఆవరణ అంతా చెరువును తలపిస్తుండగా, భవనం శిథిలావస్థకు చేరి పై పెచ్చులూడి పడుతున్నాయి. వర్షపు నీరు కారడంతోపాటు పెచ్చులూడి బాలికలపైన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆవరణలో వర్షపు నీరు నిలువడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. ఈ కళాశాలలో దాదాపు 230 మంది విద్యనభ్యసిస్తున్నారు. అందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూపులకు సంబంధించి బోధన చేస్తున్నారు. అయితే ఈ ఐదు గ్రూపులకు సంబంధించి సరిపడా తరగతి గదులు లేక ప్రయోగశాలల్లోనే పాఠాలు బోధిస్తున్నారు. ఇక ప్రాధాన్యత గల ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ఒకే తరగతి గదిలో బోధిస్తుండడంతో సరిగ్గా అర్థం కావడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సరిపడా టాయిలెట్స్ లేక విద్యార్థినులు, అధ్యాపకులందరూ కలిపి వాడుకోవాల్సిన దుస్థితి ఉన్నది. కనీసం సరైన తాగునీటి సౌకర్యం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, నూతన భవన నిర్మాణానికి 2 కోట్లు మంజూరు కాగా, గత జనవరిలో శంకుస్థాపన చేశారు. అయితే మైదానంలో మధ్యలో నిర్మాణం చేపడితే ఇబ్బందిగా మారుతుందని స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిర్మాణ పనులను వాయి దా వేశారు. అయితే కళాశాలలో ఐదు గ్రూపులు ఉండగా, ఫస్టియర్, సెకండియర్ కలిపి 10 గదులతో పాటు ఒక స్టాఫ్ రూం, లైబ్రరీకి ఒక రూం మొత్తం 12 గదు లు అవసరం ఉన్నాయి. కానీ, కేవలం 8 గదులకు మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రయోగశాలలకు సంబంధించిన గదుల నిర్మాణాలపై ఊసే లేదు. శంకుస్థాపన చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంపై విద్యార్థినులు ఆగ్రహిస్తున్నారు.
కళాశాల ఆవరణలోని చెట్ల పొదలల్లోంచి పాములు, తేళ్లు వస్తున్నాయి. వర్షం పడినప్పుల్లా ఆవరణంతా చెరువులా మారుతున్నది. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. కళాశాలకు రావాలంటే భయవం వేస్తున్నది. వెంటనే కళాశాల నూతన భవనం నిర్మించాలి.
కళాశాలలో సరిపడా గదులు లేవు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒకే గదిలో పాఠాలు బోధిస్తున్నారు. పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదు. ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు నిర్మించాలి. టాయిలెట్స్ సరిపోవడం లేదు. అవి కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. త్వరగా భవన నిర్మాణ పనులు ప్రారంభించాలి.