అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్య సామాన్యమని ఆయన అన్నారు. ఆలయ ఆచారాలపై ఆయనకు ఎంతో అవగాహన ఉందని పేర్కొన్నారు. శేషాద్రి మృతి దేవస్థానానికి, భక్తకోటికి తీరని లోటు అని అన్నారు.
ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. టీటీడీలో పదవులతో సంబంధం లేకుండా వివిధ హోదాల్లో చాలా కాలం పాటు సేవలందించిన శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తు ట్వీట్ చేశారు.