హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధుల విడుదలపై సివిల్ సప్లయ్‌కి కాంగ్రెస్ సర్కారు మొండి చేయి ఇచ్చినట్టు తెలిసింది. నిధులకు సంబంధించి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించగా నయా పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఖజానాలో పైసల్లేక యాసంగి బోనస్ బకాయిలు రూ. 1,200 కోట్లు రైతులకు ఇంకా చెల్లించలేదని, ఇప్పుడు రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తామని ప్రభుత్వ పెద్దలు అన్నట్టు తెలిసింది. ఎక్కడి నుంచైనా అప్పులు తెచ్చుకోవాలని, అవసరమైతే బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వానకాలం ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థ అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. కొనుగోలుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు నానా తంటాలు పడుతున్నది.
ఈ సీజన్లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని సివిల్‌సప్లయ్ అంచనా వేసింది. అయితే ఇది కోటి టన్నులకు చేరుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ధాన్యం కొనుగోలుకు సుమారు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో అవసరమైన నిధుల కోసం సివిల్‌సప్లయ్ అధికారులు మార్క్‌ఫెడ్‌ను సంప్రదించినట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా పెట్టి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) ద్వారా రుణం తీసుకోనున్నట్టు తెలిసింది. రూ. 20వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఇందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు మార్క్‌ఫెడ్ వర్గాలు తెలిపాయి. రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒప్పందం పూర్తికాగానే దశల వారిగా అప్పు తీసుకోనున్నట్టు సమాచారం. ఎన్సీడీసీ నుంచి ఈ రుణాన్ని సుమారు 9 శాతం వడ్డీతో తీసుకుంటున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వం అధిక వడ్డీలతో అప్పులు తీసుకొచ్చి వడ్డీ భారం మోపిందంటూ సీఎం, డిప్యూటీ సీఎం పదే పదే ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధిక వడ్డీతో రుణం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు, బియ్యం పంపిణీకి నిధులివ్వకుండా సివిల్ సప్లయ్‌ను అప్పుల ఊబిలో ముంచిందని ఆరోపించారు. ఇకపై తమ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు, బియ్యం పంపిణీకి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని, సివిల్సప్లయ్పై అప్పుల భారం పడనియబోమని గొప్పగా ప్రకటించారు. కానీ ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ‘బ్యాంకు గ్యారెంటీలు ఇస్తాం.. అప్పులు తెచ్చుకోండని’ చెప్తున్నట్టు తెలిసింది. దీంతో సివిల్ సప్లయ్ అధికారులు పథకాల అమలుకు అప్పుల కోసం వేటకు బయలుదేరారు. ఒక దశలో బ్యాంకులేవీ సివిల్సప్లయ్కు అప్పులిచ్చేందుకు ముందుకు రాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌ను అడ్డుగా పెట్టుకొని ఎన్సీడీసీ ద్వారా రుణం తీసుకుంటున్నట్టు తెలిసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గత ఆరు నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. మరో రూ.4వేల కోట్ల అప్పునకు ఆర్బీఐకి శుక్రవారం ఇండెంట్ పెట్టింది. ఈ నెల 30న నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్నది. ఈ మేరకు 27, 29, 31, 33 ఏండ్ల కాలాలకు రూ.1,000 కోట్ల చొప్పన మొత్తం రూ.4,000 కోట్లకు సెక్యూరిటీ బాండ్లు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి సర్కారు బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆరునెలల్లోనే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.49,900 కోట్ల అప్పు తీసుకుంటున్నది. కాంగ్రెస్ సర్కారు ఆదాయ రాబడిలో 35 శాతం దాటడం లేదు. కానీ, అప్పుల సేకరణలో మాత్రం 92 శాతాన్ని దాటితుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.