కడ్తాల్, ఆగస్టు 29 : ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించి ఆశా వర్కర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.18 వేలుగా నిర్ణయించి, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.
శనివారం నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో ఆశా వర్కర్ల తరుపున పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం ఆశా వర్కర్ల మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా లావణ్య, ఉపాధ్యక్షురాలుగా స్వరూప, భారతమ్మ, కోశాధికారిగా సబితా, సహాయ కార్యదర్శులుగా అనిత, పద్మ, బుచ్చమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.