నీలగిరి, డిసెంబర్ 29 : నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటారు. సోమవారం నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో, మానసిక స్థితి కోల్పోయిన మహిళ బట్టలు లేకుండా సంచరిస్తుండటాన్ని గమనించిన సీఐ మారవత్వంతో వెంటనే చలించిపోయారు. తక్షణమే జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాటు, వన్ టౌన్ మహిళా పోలీస్ సిబ్బంది, సఖి సెంటర్ సిబ్బందితో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ మహిళను సఖి సెంటర్ వాహనంలో తీసుకెళ్లి ముందుగా ఆమెకు దుస్తులు ఏర్పాటు చేసి, మంచినీళ్లు, భోజనం అందించారు. అనంతరం ఆమెను సురక్షితంగా చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు.
సీఐ మానవతపై పట్టణ ప్రజలు హృదయపూర్వకంగా ప్రశంసలు తెలియజేశారు. బాధితుల పట్ల పోలీస్ శాఖ చూపుతున్న సానుభూతి, బాధ్యతాయుతమైన వైఖరికి ఇది ఓ ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ అధికారులు మునగాల సునీత, నాగమణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్, వన్ టౌన్ మహిళా పోలీస్, సఖి సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.