బచ్చన్నపేట నవంబర్ 18 : రౌడీ షీటర్లు తీరు మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని నర్మెట సీఐ అబ్బయ్య హెచ్చరించారు. మంగళవారం జనగామ జిల్లా బచన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారి పై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను గురించి ఎస్హెచ్వోను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి నుండి రౌడీ షీట్ ఉన్న వారు ఎలాంటి కేసులో తల దూర్చరాదని సూచించారు. ఈ కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టం లో ఉన్న యాక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా చాలా కాలం నుండి రౌడీషీటు ఓపెన్ అయి ఉండి గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తు లను గుర్తించి వారి రౌడీషీట్లను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్ఐ హమీద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.