Cell Therapy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది. అంతేకాదు, డయాబెటిస్ చికిత్సకు ప్రపంచవ్యాప్తంగా 2021 ఒక్క ఏడాదిలోనే 966 బిలియన్ డాలర్లను రోగులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఈ వ్యాధిని సమూలంగా నయంచేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే, డయాబెటిస్ చికిత్సలో చైనా పరిశోధకులు వేసిన ముందడుగు వైద్య శాస్త్రంలో కీలక మైలు రాయిగా చెప్పుకొంటున్నారు. కారణం.. డయాబెటిస్ రోగికి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయడమే.
క్లోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్ ద్వారా తొలుత విశ్లేషిస్తారు. అనంతరం రోగి రక్తంలోని మూల కణాలను (సీడ్ సెల్స్) తీసుకొని సెల్ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేస్తారు. తర్వాత క్లోమంలో ప్రభావితం అయిన క ణాల స్థానంలో వీటిని (సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ప్ర వేశపెడతారు. అలా క్రమంగా రోగికి ఇచ్చే ఇ న్సులిన్, ఇతరత్రా మందుల మోతాదును తగ్గిస్తారు. 2021 జూలైలో తొలుత ఓ రోగికి ఇలా ‘సెల్ ట్రాన్స్‌ప్లాంట్’ చేశామని, 11 వారాల వ్యవధిలోనే అతను ఇన్సులిన్, ఇతరత్రా మందుల వాడకాన్ని పూర్తిగా మానేశాడని చైనా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ సంపూర్ణంగా నయమైనట్టు వెల్లడించారు. గడిచిన 33 నెలలుగా సదరు వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవట్లేదని వివరించారు.
చైనాలోని చాంగ్జెంగ్ దవాఖాన, రెంజీ దవాఖాన వైద్యులు సంయుక్తంగా ఈ ప్రయోగం చేశారు. ఈ వివరాలు ‘సెల్ డిస్కవరీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
‘డయాబెటిస్ సెల్ థెరపీ’లో ఈ ప్రయోగం ఓ గొప్ప ముందడుగు. ఈ సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్తో బాధపడుతున్న కోట్లాది మందికి ఆర్థికంగా, శారీరకంగా ఎంతో ఉపశమనం లభిస్తుంది.