న్యూఢిల్లీ, జూలై 4: తన వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం దలైలామాకే ఉంటుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన దరిమిలా మతానికి సంబంధించిన వ్యవహారాలపై తాము ఎటువంటి వైఖరి తీసుకోలేదని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. తాను భారత ప్రభుత్వం తరఫున మాట్లాడలేదని, ఒక దలైలామా అనుచరుడిగా మాట్లాడానని రిజిజు కూడా వివరణ ఇచ్చారు.
అంతకుముందు రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలకు హాని చేకూరకుండా నిరోధించేందుకు చైనా ఆంతరంగిక వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకోవడం ఆపాలని హెచ్చరించారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అధికారికంగా స్పందించారు. మత విశ్వాసాలకు సంబంధించిన సంప్రదాయాల విషయంలో భారత్ ఎటువం టి వైఖరిని తీసుకోవడం, మాట్లాడడం కాని చేయబోదని ఆయన చెప్పారు.