కాశీబుగ్గ, మార్చి 2 : మిర్చి ధర క్వింటాల్‌కు రూ.2,000 తగ్గడంతో సోమవారం వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత శుక్రవారం యూఎస్ 341 రకం మిర్చి క్వింటాల్‌కు రూ.23 వేలు ధర పలికింది. శని, ఆదివారం మార్కెట్‌కు సెలవులొచ్చాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగా వ్యాపారులు ఇదే రకం మిర్చిని రూ.21 వేలకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు.
రెండు రోజుల్లోనే ధర తగ్గించడమేమిటని ప్రశ్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైతులను గేటు దగ్గర నిలిపివేశారు. మార్కెట్ సెక్రటరీ మల్లేశం, సీఐ జవ్వాజి సురేశ్, ఎస్సై రాజు, మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ గంధమల్ల రాజేందర్ రైతులతో మాట్లాడి సముదాయించారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి రోజూ ఒకేలా ధర ఉండదని, దీని ప్రకారమే ఉత్పత్తులను కొనుగోలు చేస్తారని తెలిపారు.