న్యూఢిల్లీ: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. ఆ సయమంలో ఓ లాయర్ తన వాదనలు వినిపిస్తూ బిగ్గరగా అరిచారు. అప్పుడు చీఫ్ జస్టిస్(Chief Justice DY Chandrachud) జోక్యం చేసుకున్నారు. స్వరాన్ని తగ్గించుకోవాలంటూ ఆ లాయర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ లాయర్ క్షమాపణలు చెప్పారు. వాదనలు జరుగుతున్న సమయంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. నిరసన ప్రదర్శనలో ఓ లాయర్ రాళ్లు రువ్వినట్లు తన వద్ద ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో అడ్వకేట్ కౌస్తవ్ భాగ్చి మాట్లాడుతూ.. ఓ సీనియర్ న్యాయవాది కోర్టులో ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. అదే సమయంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోర్టు బయట జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా, గడిచిన రెండు గంటల నుంచి మిమ్మిల్ని గమనిస్తున్నానని, గొంతును తగ్గించి మాట్లాడాలంటూ పేర్కొన్నారు. ముగ్గురు జడ్జీల ముందు మీరు మాట్లాడుతున్నారని, మీరేమి జనాలను ఉద్దేశించి మాట్లాడటం లేదని సీజే తెలిపారు. సీజే వార్నింగ్‌తో లాయర్ క్షమాపణలు చెప్పారు. వచ్చే మంగళవారం లోపు వైద్యురాలి హత్యాచారం కేసుపై కొత్త రిపోర్టును సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.