బూర్గంపహాడ్, మే 11 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకకు చెందిన నర్మద ఇటీవల ప్రమాదానికి గురికావడంతో రెండు కాళ్లు, వెన్నెముక, ఛాతిలో తీవ్రంగా గాయాలై మంచానికే పరిమితమైంది. విషయం తెలుసుకున్న మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ నిర్వాహకులు కైపు లక్ష్మీనారాయణరెడ్డి సభ్యులతో కలిసి సారపాకలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నర్మద నివాసానికి వెళ్లి సోమవారం రూ.6 వేలు ఆర్ధిక సాయం అందించారు. నర్మదకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నర్మద వైద్య ఖర్చులకు ఆర్థిక భారం ఉండడంతో ట్రస్ట్ నుండి తమవంతుగా ఈ సహాయం అందించడం జరిగిందని తెలిపారు. నిరుపేద కుటుంబానికి దాతలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి మల్లారెడ్డి, సహాయ కోశాధికారి గాదె నర్సిరెడ్డి, ట్రస్ట్ సభ్యులు సాయిబాబా, సెనగ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.