ముంబై: భారత జట్టు తరఫున యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు చేస్తాడని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. ‘సరైన సమయంలో రుతురాజ్ అవకాశాన్ని పొందాడు. టీ20 జట్టులో ఉన్న అతడు ఇప్పుడు వన్డేలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా దేశానికి అద్భుతాలు అందిస్తాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. మేం అతడిని ఎంపిక చేశాం.. అయితే తుది జట్టులో ఉంటాడా.. లేదా? అనేది జట్టు మేనేజ్మెంట్ చూసుకుంటుంది. రుతురాజ్‌ను ఏ స్థానంలో పంపించాలి? అతడి అవసరం ఎక్కడా అనేది వాళ్లు చూసుకుంటారు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నాం’ అని చేతన్ శర్మ తెలిపాడు. 24 ఏండ్ల రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 603 పరుగులతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు రుతురాజ్‌ను సఫారీలతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. గతేడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ యువ క్రికెటర్ అరంగేట్రం చేశాడు.