చెన్నై: ఆ అమ్మాయి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నది. తనను తాను రక్షించుకోవటానికి చాలా రోజులు ఓపిక పట్టింది. అక్కడి నుంచి వేరే స్కూల్కు కూడా మారింది. అయినా ఫలితం లేకపోయింది. ఇక మరణమే శరణ్యం అనుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బలవన్మరణానికి ముందు ఆమె రాసిన సూసైడ్ లెటర్లో ఆడవాళ్లు ఏ స్థాయిలో వేధింపులను ఎదుర్కొంటున్నారో ఒకే ఒక్క వాక్యంలో వివరించింది. చెన్నైలోని పూనామల్లే ప్రాంతానికి చెందిన పదకొండో తరగతి విద్యార్థిని.. లైంగిక వేధింపులను తట్టుకోలేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొన్నది. సూసైడ్ నోట్లో ‘ఆడవాళ్లకు తల్లి గర్భం, సమాధి మాత్రమే రక్షణ ఉండే ప్రాంతాలు’ అని రాసింది. స్కూల్లోగానీ, బంధువుల్లో గానీ రక్షణ కల్పించేవాళ్లు లేరని, అంతా క్రూరమృగాలేనని వ్యాఖ్యానించింది. కాగా, ఈ అమ్మాయి తొమ్మిదో తరగతి వరకు ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివింది. అక్కడ టీచర్ కొడుకు తనను వేధించటంతో స్కూల్ మానేసి ప్రభుత్వ పాఠశాలలో చేరింది. అయినా వేధింపులు ఆగకపోవటంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడింది.