CSK | చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ‘ఎల్‌క్లాసికో’ పోరులో చెన్నైదే పైచేయి అయింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరుజట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో చెన్నై.. 4 వికెట్ల తేడాతో గెలిచి మెగాటోర్నీని విజయంతో ఆరంభించింది. టాస్ గెలిచి ముందు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బంధించిన సీఎస్కే.. ఆ జట్టును 155/9కే పరిమితం చేసింది. ఈ సీజన్లో చెన్నైకి ఆడుతున్న ఆఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (4/18) స్పిన్ మాయకు తోడు ఖలీల్ అహ్మద్ (3/29) పేస్‌కు ముంబై నిలవలేకపోయింది.
తిలక్ వర్మ (25 బంతుల్లో 31, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ఒక దశలో చెన్నై.. 78/2తో పటిష్టంగా కనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతసేపు చెన్నై స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. కానీ ముంబై స్పిన్నర్ విఘ్నేశ్ (3/32) స్పిన్‌తో ఆతిథ్య జట్టు విజయం కోసం చెమటోడ్చక తప్పలేదు. గైక్వాడ్‌తో పాటు దూబె (9), హుడా (3), కరన్ (4) నిష్క్రమించినా రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జడేజా (17) చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో జడ్డూ రనౌట్‌గా నిష్క్రమించడంతో ధోనీ క్రీజులోకి రాగానే చిదంబరం స్టేడియం హోరెత్తిపోయింది. నూర్ అహ్మద్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
తిప్పేసిన నూర్
ముంబై తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్.. రోహిత్‌ను డకౌట్ చేయడంతో పాటు రికెల్టన్ (13)నూ క్లీన్‌బౌల్డ్ చేసి ముంబైని ఆదిలోనే దెబ్బకొట్టాడు. విల్ జాక్స్ (11)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. 8వ ఓవర్లో బంతిని అందుకున్న నూర్.. తన రెండో ఓవర్లోనే సూర్యను బోల్తొ కొట్టించాడు. వికెట్ల వెనుక ధోనీ అద్భుత స్టంపింగ్‌తో సూర్య ఇన్నింగ్స్‌కు తెరపడింది. 13వ ఓవర్లో నూర్.. రాబిన్ మింజ్ (3), తిలక్ (31)ను ఔట్ చేసి ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన చివరి ఓవర్లో అతడు నమన్ (17)నూ బౌల్డ్ చేశాడు. నాలుగు ఓవర్లలో అతడు ఒక్క బౌండరీకి కూడా ఇవ్వలేదు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 155/9 (తిలక్ 31, సూర్య 29, నూర్ 4/18, ఖలీల్ 3/29); చెన్నై: 19.1 ఓవర్లలో 158/6 (రచిన్ 65 నాటౌట్, రుతురాజ్ 53, విఘ్నేశ్ 3/32, దీపక్ 1/18)