RoboChef | ‘ఇనుములో హృదయం మొలిచెనే.. ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే’ అంటూ అప్పట్లో రోబో సినిమాలో ‘చిట్టి’ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చిట్టికి మానవ స్పర్శ తెలియడం అచ్చంగా రీల్ క్రియేషన్. చిట్టికి రుచి తెలియడం అన్నది రియల్ ఇన్నోవేషన్. సరికొత్త యంత్రుడికి కిచెన్‌లో ఏం వండాలో తెలుసు.. ఏ కూరలో ఎంత ఉప్పు, ఎంత కారం వేయాలో కూడా తెలుసు. మరమనిషి.. తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్లగలడు.
ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత, మనుషులకు సాయంగా రోబోలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రతిపనిలో రోబో సాయపడుతున్నది. ఈ ఆవిష్కరణ కొన్నిచోట్ల సిబ్బంది కొరతను తీరుస్తుంటే.. మరికొన్ని చోట్ల ఎంతోమంది పొట్టకొడుతున్నది. ‘ఇన్నాళ్లూ రోబోలు ఒక్కవంట మాత్రం చేయలేవు’ అనుకునేవారు. ఇకనుంచి ఆ బాధ్యత కూడా రోబోలు తీసుకోనున్నాయి.
‘రుచి చూడటం, కమ్మదనాన్ని ఆస్వాదించడం’ మనిషికి మాత్రమే తెలిసిన విద్య. ఇప్పుడు ఆ రహస్యం మరమనిషీ గ్రహించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బయో ఇన్స్పైర్డ్ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు ఆ అద్భుతాన్ని సాధించారు. ఆహారాన్ని నములుతూ.. రుచిని అంచనా వేసే రోబోలను కనుగొన్నారు. మనం దేన్నయినా నమిలినప్పుడు మెదడు పంపే సంకేతాల ఆధారంగానే మనకు రుచి తెలుస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే రోబోలు కూడా ఆహారం నమలడాన్ని అలవాటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధ సాయంతో వంట ఎంత రుచిగా ఉందో, ఎంత చప్పగా తయారైందో చెప్పేస్తాయి. ఈ సాంకేతికతను ‘బెకో’ అనే కంపెనీ.. కేంబ్రిడ్జ్ పరిశోధకులకు అందించింది. ఈ కృత్రిమ మేధ సాయంతోనే రోబో చెఫ్‌లు.. కూరలూ గట్రా వండటంలోని సంక్లిష్టతను అర్థం చేసుకుంటున్నాయి.
పరిశోధకులు రుచిని కనుగొనే విషయంలో రోబోలకు శిక్షణ ఇవ్వడానికి మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించారు. ఆమ్లెట్ వేయడం అలవాటు చేశారు. అంతకుముందే గిలకొట్టిన గుడ్లు, టమాట, ఉప్పు సిద్ధం చేశారు. రోబో చెఫ్.. రుచికి తగ్గట్టు ఉప్పు జోడించి.. ఆమ్లెట్ సిద్ధం చేసింది. దాన్ని నములుతూ రుచిని అంచనా కూడా వేసింది. బెంగళూరుకు చెందిన యూఫోటిక్ ల్యాబ్స్ రూపొందించిన స్మార్ట్ రోబో పేరు ‘నోష్’. ఇది ఉప్మా, పోహా, హల్వా, కిచిడీ, ఫ్రైడ్ రైస్ వంటి వివిధ రకాల భారతీయ వంటకాలను చిటికెలో వండుతుంది. వినియోగదారులు యాప్ ద్వారా నచ్చిన డిష్‌ను ఎంచుకుని క్లిక్ చేస్తే చాలు.. దానికి తగ్గట్టుగా వంట ప్రారంభిస్తుంది. సెన్సర్ల సాయంతో మధ్యమధ్యలో పాత్రలోని పదార్థాన్ని కలుపుతుంది. ఈ ఏడాది సరికొత్త సెన్సర్లతో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు తయారీదారులు. ఇది ప్రింటర్, కాఫీ మిషన్ సైజులో ఉంటుంది కాబట్టి కిచెన్‌లో సరిపోతుంది. నోష్ రోబో ఇంట్లో ఉంటే.. అల్పాహారానికి ఇబ్బందేమీ ఉండదు. దీని ధర రూ.40 వేల నుంచి రూ.50వేల వరకు ఉంటుంది. ఇప్పటివరకు నోష్ వండిన వంటకాలను 500 మందికిపైగా తిన్నారు. వారంతా 4.4+ రేటింగ్ ఇచ్చారు.
చెన్నైకి చెందిన రోబో చెఫ్ అనే స్టార్టప్ తయారుచేసిన రోబో ఏకకాలంలో 600 మందికి వండగలదు. దీన్ని చెన్నైకి చెందిన శరవణన్ సుందరమూర్తి అనే ఇంజినీర్ తయారు చేశారు. ఈ రోబో రెస్టారెంట్లు, కిచెన్లకు పనికొస్తుంది. ఒకేసారి 100 రకాల కూరగాయలను ఉడికించగలదు. కూరగాయలను శుభ్రం చేయడానికి, తరగడానికి, మసాలా దినుసులను మెత్తగా దంచి.. సరైన నిష్పత్తిలో కూరలో వేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ కూడా జోడించారు. ఇంకేముంది, గృహిణికి ఓ అసిస్టెంట్ లభించబోతున్నది.
గతంలో స్పేస్ ఎక్స్ బృందంలో పనిచేసిన బెన్సన్ అనే ఇంజినీర్ స్టెల్లార్ పిజ్జా అనే స్టార్టప్‌కు ప్రాణం పోశాడు. ఈ సంస్థ రూపొందించిన రోబో నిమిషానికి ఒక పిజ్జా తయారు చేస్తుంది. చకచకా వడ్డిస్తుంది.
బల్లాబూట్ అనే రోబో సర్వర్.. ఐదుగురి పనులను ఒక్కటే చేస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ చికెన్ రోబోటిక్ సంస్థ పేరు.. నల. మన పురాణాలు పాశ్చాత్యులకూ ఒంటబడుతున్నాయి. త్వరలోనే ‘భీమ రోబోటిక్స్’ కూడా వచ్చేస్తుందేమో!
కొన్ని రోబోలకు కేలరీ లెక్కలూ తెలుసు. మనకు వడ్డించాల్సిన ఆహారంలో ఎన్ని కార్బొహైడ్రేట్లు ఉండాలో, ప్రొటీన్లు ఎంతమేర జోడించాలో ముందే చెప్పేయవచ్చు.
“Nikhil Kamath | 14వ ఏటనే బడి మానేసిన కుర్రాడు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కే కింగ్ అయ్యాడు!!”