వందనాలు అన్నదాత వందనాలు
ఆకలిపై నిరంతరం సాగించే పోరులోన
ఆకుపచ్చ సైన్యాలను నడిపించే సేనానికి
తలలూపే వరికంకుల తత్వం తెలిసిన జ్ఞానికి..
॥వందనాలు॥
అనునిత్యం భూమితో సాము చేయు వీరునికి
అన్యాయాన్నెదిరించిన అసమాన ధీరునికి
ధనస్వాముల కొమ్ముకాయు
జనస్వాముల మెడలు వంచి
అంతిమ విజయం సాధించిన హలధారునికి
॥వందనాలు॥
కల్లబొల్లి నల్ల కుళ్ల్లు చట్టాలను విసిరికొట్టి
ఢిల్లీ కోటను నాగళ్లతోటి చుట్టుముట్టి
కార్పొరేటు జీతగాళ్ల కుట్రలనెదిరించినావు
అవిశ్రాంత పోరులోన కాలాన్ని జయించినావు
॥వందనాలు॥
మట్టిపిసికి అన్నం మాకందించే దాతవు
సంకెలపై సాగించిన పోరులో విజేతవు
నిన్ను నిలువరించలేవులే చలి ఎండా వానలు
నీ పాదాలకు మొక్కుతాయి ఆ కొండా కోనలు
॥వందనాలు॥