e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌..

ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌..

(ప్రజలు ఆదివారం సాయంత్రాలను, అర్ధరాత్రి దాకా ఉత్సవంలా గడుపుకోవాలని, ట్యాంక్‌బండ్‌ మీద అన్నివైపులా ట్రాఫిక్‌ను ఆపేసి, మనసులు తేలిపోయే మరో కొత్త లోకాన్ని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, స్వప్నంలా ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా, చారిత్రాత్మక చార్మినార్‌ దగ్గర అందరూ కలుసుకొని, ఒక అరుదైన వేడుకలా, సాయంత్రం నుంచి సగం రాత్రి దాకా ‘బారాత్‌’లా గడపాలని, కొత్త ఆలోచనను దృశ్యం చేసింది. ఆదివారం సాయంత్రాలను ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ పేరున, మన సంస్కృతిని తెలియజేసే, వినూత్న సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది).

ఆకాశంలో వన్నెలు పోతున్న తారలు
నేల మీద పులకించి వికసిస్తున్న స్వప్నాలు
పక్షులు తిరగని కాలం చూసి,
ఎగురుతున్న రెక్కల దీపాలు

- Advertisement -

రంగురంగుల చీకట్లు
అలలు అలలుగా వొంపులు పోతూ
ఇంద్రనీలాలను కుప్ప పోస్తున్న రాత్రి

కొలనులో తేలిన మేఘాల ప్రతిబింబాల్లా
చార్‌ కమాన్‌ చౌరస్తా రద్దీలో
నీడను చూసుకొంటున్న చార్మినార్‌

నిద్రపోని పావురాల రెక్కల టపటపలు
నగిషీల మీద కదులుతున్న స్వరాలు..

వొలికిపోయిన అత్తరులా
నలిగిపోతున్న,
మెత్తని సవ్వడి లేని గాలి స్పర్శ వొయలు

ఉరుసు జల్సాలా జనం
ఈద్‌ రోజుల్లో లాగా బజార్‌ కోలాహలం
ముషాయిరాల సౌందర్యాల కలకలం

దసరా ములాకాత్‌ లా
దీపావళి బాణసంచాలా
ఉగాది పచ్చని తోరణాల్లా
జనవరి నెలలో వెలసే,
నుమాయిష్‌ గ్రౌండ్‌ సందడిలా
హైదరాబాద్‌కు,
అపురూపమైన ఆకర్షణగా దర్శనమిచ్చే,
చార్మినార్‌ చుట్టూ చేరింది

మాటల్లో మాటలు కలిసిపోయి
మనసులు మఖ్‌మల్‌లా మారిపోయి
జాతర లాంటి వేడుకలో
పెనవేసుకొని చుట్టుముట్టిన
మనుషుల సువాసన,
సంస్కృతి నిండా గుబాలిస్తూంది

మొదటి వానలో మట్టి తడిసి లేచిన
జీవిత మహిమ పట్టు పొగల దారాల్లా
కళ్ళనూ చూపులనూ.. అల్లుకొంటూంది
ఇప్పుడు చార్మినార్‌, మనుషుల గుంపుతో..
మనోహరంగా మారింది

ఆదివారం ఆదివారం
ఉత్సవాలు జరిగే
ట్యాంకుబండు నుండి,
ఆగ్రా మిఠాయి రుచుల, రకాల దాకా,
వెండి బంగారు దుకాణాల మెరుగుల దాకా,
ముత్యాల పరదాల–
గుల్జార్‌ హౌజ్‌ దాకా,.
సాయంత్రం నుండి
సగం రాత్రి సంబరాల దాకా,.
రోడ్లు మేనాల వరసలు..
సాగుతున్నట్టున్నాయి

సంస్కారాలు, సంప్రదాయాలు,
మతాలు మమతలు కలిసిపోయిన —
సంస్కృతుల దాకా,

అరచేతులకు మైదాకు చిత్రాలు గీసినట్టు,
ప్రేమా గౌరం విలసిల్లిన —
లాడ్‌ బజార్‌ పిలుపుల మర్యాద దాకా,

సొగసైన చారిత్రక చార్మినార్‌ దాకా,
తెలంగాణ విలువైన ప్రేమ కిరీటం దాకా,

వేనవేల కాంతుల వేకువను స్వాగతించే
నిద్రపోని ఆకాశం దాకా,

ఒక కొత్త ఆలోచన
నదిలో నడిచే పడవ అందంలా
ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌
కలకలా గలగలా మిలమిలా
ఈ నగరాన్ని ఓలలాడిస్తూంది.

ఆశారాజు 93923 02245

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement