హిమాయత్‌నగర్,ఏప్రిల్ 8: దశాబ్ధాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరల్లో వరద ముప్పు సమస్య తీరనుంది. స్టాటిజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ)లో భాగంగా మంజూరైన రూ.9 కోట్ల వ్యయంతో పెండింగ్‌లో ఉన్న రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లిబర్టీ నుంచి హిమాయత్‌నగర్ వీధి నంబర్15 వరకు జనార్దన్బడా బస్తీని ఆనుకొని హుస్సేన్ సాగర్ నాలా ప్రవాహం కొనసాగుతోంది.
దత్తానగర్,జనార్దన్బడ,ఆదర్శబస్తీ తదితర బస్తీలకు చెందిన ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే భయాందోళనకు గురయ్యేవాళ్లు. నాలాకు పటిష్టమైన రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపడితే వాసన, దుర్గధం వ్యాపించకుండా ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు భావించారు. ఎన్నో ఏళ్లుగా నాలాకు ఇరువైపులా నివసిస్తున్న పేదలు వరద నీటి సమస్యతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని గతంలోనే మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ దత్తానగర్‌లో పర్యటించి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.ఈ పనులు పూర్తైతే పరిసర ప్రాంతాల బస్తీ ప్రజలకు వరద ముంపు సమస్య పరిష్కారం లభించనుంది.