వేములవాడ రూరల్, జనవరి 8 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెక్‌డ్యామ్‌లకు రక్షణ లేకుండాపోయింది. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో వరుస ఘటనలు కలకలం రేపగా, తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో మూలవాగుపై ఉన్న చెక్‌డ్యామ్ రక్షణ గోడ ధ్వంసానికి గురైంది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇసుక కోసమే కూల్చివేశారా? లేక మూలవాగుకు అవతలివైపు వెళ్లేందుకే అడ్డుగా ఉన్న గోడను తొలగించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1968లో వేములవాడ రాజన్న గుడి చెరువుకు నీటిని తరలించేందుకు దాదాపు రూ.75 లక్షలతో మల్లారం మూలవాగుపై చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. దీని పక్కనుంచే కాలువ నిర్మించి గుడి చెరువుకు కలిపారు. దీంతో ఈ ప్రాంతంలో అప్పట్లో తాగునీటి గోస తీరింది. సమీపంలోని లింగంపల్లి, మల్లారం గ్రామాల పరిధిలోనూ భూగర్భజలాలు పెరిగి సాగునీటికి ఇబ్బంది లేకుండాపోయింది. రెండు రోజుల క్రితం చెక్‌డ్యామ్‌పై ఉన్న రక్షణ గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. చెక్‌డ్యామ్‌కు రక్షణ ఉండే గోడను కూల్చడం వల్ల వానకాలంలో అధికంగా వచ్చే వరద ఒడ్డును కూల్చే ప్రమాదమున్నదని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనప్పుడు సర్కారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా చెక్‌డ్యామ్‌లు పేల్చివేతకు గురవుతున్నా.. వాటిపై విచారణ జరిపి నిగ్గు తేల్చడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ముమ్మాటికీ అవి కూల్చివేతలే అంటూ సాక్షాత్తూ ఇంజినీరింగ్ అధికారులు ఠాణాల్లో ఫిర్యాదు చేసినా.. విచారణ మాత్రం ముందుకెళ్లడం లేదు. నిందితులను పట్టుకోవడంలేదు. ఈ నేపథ్యంలోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అయినా సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పెద్దపల్లి-కరీంనగర్ జిల్లాల్లో జరిగిన వరుస ఘటనలే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం పెద్దపల్లి మండలం భోజన్నపేట హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కూల్చివేసేందుకు కొంతమంది కుట్రలు చేసినా.. నవంబర్‌లో ఓదెల మండలం గుంపుల జమ్మికుంట మండల తనుగుల మధ్యన కూల్చివేసినా.. డిసెంబర్లో మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో కూల్చివేసినా చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మల్లారం చెక్‌డ్యామ్‌పై రక్షణ గోడ కూల్చివేసింది వాస్తవమే. పంచాయతీ సిబ్బంది కూల్చివేసినట్టు తెలిసింది. అనుమతులు లేకుండా కూల్చివేశారు. వారిపై ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకోవడంతోపాటు రక్షణ గోడను నిర్మిస్తాం. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడుతాం. -శ్రీనివాస్, ఇరిగేషన్ డీఈ
చెక్‌డ్యామ్ వరకు వెళ్లేందుకు రహదారిని ఏర్పాటు చేశాం. ఇటీవలే గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి చికెన్ సంబంధిత వ్యర్థాలను మూలవాగు సమీపంలోని బావిలో వేయాలని తీర్మానం చేశాం. గ్రామంలోని చికెన్ వ్యర్థాలను చెక్‌డ్యాం అవతలి వైపు ఉన్న బావిలో వేసేందుకు బండ్లపై వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేశాం. కానీ, రోడ్డు వేసే క్రమంలో జేసీబీ తగిలి రక్షణ గోడ కూలిపోయింది.