హోరాహోరీగా సాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సమరాంగణంలో పార్టీల గెలుపును నిర్ణయించే కీలక స్థానాలకు ఈ ఆదివారం మూడో దశ పోలింగ్ జరుగనున్నది. విపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేశ్ కంచుకోటగా పిలిచే యాదవ్ బెల్ట్‌లోని 16 జిల్లాల్లో జెండా మళ్లీ పాతాలని బీజేపీ.. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్న అఖిలేశ్ ఎత్తులతో ఈ దఫా ఎన్నికలు మినీ వార్‌ను తలపిస్తున్నాయి.
పశ్చిమ యూపీ, అవధ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో యాదవ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. ఇక్కడి 16 జిల్లాల్లోని 59 స్థానాలకే మూడో దశలో ఆదివారం పోలింగ్ జరుగనున్నది. 2012 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎస్పీ 37 సీట్లను గెలుపొందగా, బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. అయితే, 2017ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొన్నది. ఆ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఏకంగా 49 సీట్లు రాగా, ఎస్పీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యాదవ ఓటర్లు దండిగా ఉన్నప్పటికీ, ఎస్పీ భారీ స్థాయిలో సీట్లు కోల్పోవడానికి కారణం కుటుంబ కలహాలే. డిసెంబర్ 2016లో సరిగ్గా ఎన్నికలకు ముందు బాబాయ్ శివపాల్‌సింగ్ యాదవ్‌తో అఖిలేశ్‌కు అభిప్రాయ భేదాలు వచ్చాయి. బహిరంగ సభల్లోనే ఇరువురూ మాటల యుద్ధానికి దిగడంతో పార్టీ రెండోశ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య విభజన రేఖ ఏర్పడింది. అఖిలేశ్ కుటుంబ కలహాలను ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ వాడుకొన్నది. దీంతో ఆ ఎన్నికల్లో ఎస్పీకి పట్టున్న ఫిరోజాబాద్, కాస్గంజ్, ఈటా, కన్నౌజ్ తదితర ప్రాంతాల్లో ఆ పార్టీ జాడ లేకుండా పోయింది. ఈ ప్రభావం 2019 సాధారణ ఎన్నికల్లోనూ కొనసాగింది.
గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకొన్న అఖిలేశ్ ఈ సారి ఎన్నికల్లో యాదవ ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకోవడానికి ముందస్తు ప్రణాళికతో కదిలారు. తన బాబాయ్ శివపాల్‌తో మళ్లీ చేతులు కలపడం, పార్టీ కార్యకలాపాల్లో ఆయన్ని భాగస్వామిగా మార్చడం ఇందులో భాగమే. యాదవ ఓట్లను చేజిక్కించుకొనేందుకు భారీగా హామీలు ఇచ్చారు. అలాగే మూడోదశలో పోలింగ్ జరుగనున్న ప్రాంతాల్లో హత్రాస్ నియోజకవర్గం కూడా ఉన్నది. 2020 సెప్టెంబర్‌లో జరిగిన లైంగికదాడి కేసు, బీజేపీ నేతల వైఖరిని ప్రచారంలో భాగంగా ప్రముఖంగా ఎండగట్టారు. కన్నౌజ్ ఎమ్మెల్సీ, ఎస్పీ నేత పీయూష్ పంపి జైన్‌పై ఐటీ సోదాలు జరిపి ఎస్పీని ఇరుకున పెట్టాలనుకొన్న బీజేపీ.. పొరపడి తన పార్టీ మనిషి, కాన్పూర్‌కు చెందిన అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇండ్లపై సోదాలు నిర్వహించడాన్ని కూడా అఖిలేశ్ ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. విపక్షాలను బీజేపీ ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నదో ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేశారు. బుందేల్‌ఖండ్‌లో నెలకొన్న నీటికొరత, నిరుద్యోగ సమస్యలపై అధికార బీజేపీని నిలదీయడంలోనూ విజయవంతమయ్యారు.
బీజేపీకి అఖిలేశ్ సూచన
న్యూఢిల్లీ/ఫిరోజాబాద్: నిత్యం అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ తన పేరును ‘భారతీయ జగడా పార్టీ’గా మార్చుకోవాలన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హల్ నియోజకవర్గంలో అఖిలేశ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే ఫిరోజాబాద్లోనూ అఖిలేశ్ ప్రచారం చేశారు. ‘ఇప్పటికే జరిగిన రెండు విడుతల పోలింగ్‌లో మాకు 100 సీట్లు వస్తాయి. నాలుగో విడుత పోలింగ్ ముగిసేసరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు సాధిస్తాం. మొత్తానికి ఎన్నికలు ముగిసిన తర్వాత సమాజ్‌వాదీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అనంతరం కులాల వారీగా జనగణనకు కృషి చేస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం దక్కేలా చూస్తాం’ అని అఖిలేశ్ హామీ ఇచ్చారు.