లండన్ : శాశ్వత నివాస నిబంధనలను యూకే కఠినతరం చేయనున్నది. ఆ దేశ హోం మంత్రి షబానా మహమూద్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. శాశ్వత నివాసానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ప్రస్తుతం ఉన్న 5 ఏండ్ల నివాస గడువును పదేండ్లకు పెంచనున్నట్టు చెప్పారు. మరికొన్ని విభాగాల కింద వలసదారులు శాశ్వత నివాసం కోసం 20 ఏండ్లు ఎదురుచూడాల్సి రావొచ్చు. మరోవైపు శాశ్వత నివాస అర్హత నిబంధనలను కూడా యూకే కఠినతరం చేయనున్నది.
దరఖాస్తుదారులకు ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆంగ్లభాషా నైపుణ్యం కూడా మెరుగ్గా ఉండాలి. గత మూడేండ్లుగా ఏటా 12,570 పౌండ్ల కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉండాలి. ఫుల్‌టైమ్ ఎంప్లాయ్మెంట్ అవకాశం తక్కువగా ఉన్నవారు, శరణార్థులు, ఫ్యామిలీ వీసాదారులు, వర్క్ వీసాలపై ఆధారపడిన వారిపై ఈ కొత్త నిబంధనల ప్రభావం అధికంగా ఉండనుంది. అయితే వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా పదేండ్ల బేస్‌లైన్ మారొచ్చని సమాచారం.