న్యూఢిల్లీ, ఏప్రిల్13 : హొర్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ చమురు ట్యాంకర్ల నుంచి తాము ఎలాంటి టోల్ ఫీజునూ వసూలు చేయటం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాలు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్ కలిగి ఉన్నాయని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ అన్నారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ, ‘హొర్ముజ్లో భారత చమురు ట్యాంకర్లపై టోల్ ఫీజు విధించ లేదు.
అంతర్జాతీయ చట్టాలకు, స్వేచ్ఛాయుత నౌకాయాననికి ఇరాన్ కట్టుబడి ఉంది. హొర్ముజ్ జలసంధి మా ప్రాదేశిక జలాల్లో ఉంది. సమీప భవిష్యత్తులో దీనిపై ఎలాంటి విధానం అనుసరిస్తామన్నది అన్ని దేశాలకూ తెలిపాం’ అని అన్నారు. అమెరికాతో చర్చలు పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ షరతులను అమెరికా అంగీకరిస్తే, మరో విడత చర్చలు ఉంటాయని అన్నారు.