కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 6: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహరావు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత లేదని ఆరోపించారు. పార్టీ గెలుపుకన్నా టీఆర్ఎస్ను ఓడించాలనే ప్రయత్నంలో ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నాయని దుయ్యబట్టారు.
పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వచ్చినా పార్టీలో మార్పు రాలేదన్నారు.కేంద్రంలోని బీజేపీ పాలనలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలతోపాటు రైతు వ్యతిరేక చట్టాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ నెల 8న తెలంగాణ భవన్లో అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు.