e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News పేగులు తెగేదాకా కొట్లాడుతున్నా..దున్నపోతుమీద వానే

పేగులు తెగేదాకా కొట్లాడుతున్నా..దున్నపోతుమీద వానే

  • రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్‌, బీజేపీ మాట్లాడవేం?
  • యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు?
  • వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు?
  • బీజేపీ నేతల పని విషం చిమ్మడమే
  • టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి
  • వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?
  • మేం గుజరాత్‌కు గులాం కాదు..
  • ఢిల్లీ పాలకులకు బానిసలం కాదు
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
  • గులాబీ పార్టీలో చేరిన చల్మెడ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనాలని వారం రోజులపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో పేగులు తెగేలా కొట్లాడినా కేంద్రంపై దున్నపోతుమీద వానపడ్డట్టే ఉన్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఒక్కరూ మద్దతు తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది టీఆర్‌ఎస్‌ పార్టీయేనని పునరుద్ఘాటించారు. గత రెండు దశాబ్దాలనుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా.. కొట్లాడింది గులాబీ జెండా మాత్రమేనని గుర్తుచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు గులాబీ కండువా కప్పి చల్మెడను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ వారికి విషం చిమ్మడం తప్ప విషయమేమీ లేదని ఎద్దేవాచేశారు. యాసంగిలో వరి పంట వేయించి రైతులను ఆగం చేయాలనే యావే తప్ప.. తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. వన్‌ నేషన్‌ వన్‌ టాక్స్‌ , వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అనే బీజేపీ.. వన్‌ నేషన్‌.. వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీని ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు.

- Advertisement -

కేంద్రానికి విధానం లేదు
జాతీయ పార్టీ అయిన బీజేపీకీ, కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణకు సంబంధించి ఒక విధానమంటూ లేదని కేటీఆర్‌ విమర్శించారు. రైతులు నాట్లు వేసేది ఇప్పుడైతే.. వరి వెయ్యాల్నో వద్దో ఫిబ్రవరిలో చెప్తామని కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, కిషన్‌రెడ్డి పేర్కొనడం దారుణమన్నారు. ‘కేంద్రం కొంటే వరి వేస్తం.. లేకపోతే వరి వెయ్యం.. ఈ విషయాన్ని రైతులకు చెప్తాం అంటే.. కేంద్రం చెవికెక్కడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో తెలంగాణలో యాసంగి, వానకాలం కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగైతే రూ.3,392 కోట్ల విలువైన 24.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 2020లో 1.04 కోట్ల ఎకరాల్లో 1.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని రూ.26,612 కోట్లతో కొన్నామని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఇంత పెద్ద ఎత్తున సాగుకావడానికి సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన రైతు అనుకూల విధానాలు, పథకాలే కారణమని చెప్పారు. ఉప్పుడు బియ్యం కొనడంలేదని ఒడిశాకు చెందిన బీజేడీ ఎంపీలు కూడా లోక్‌సభలో ప్రశ్నించారని, కేంద్రం కొనకపోతే బంగాళాఖాతంలో పారబోయాలా? అని నిలదీశారని గుర్తుచేశారు. తలసరి ఆదాయంలోనూ, జీడీపీ వాటాలోనూ తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని పేర్కొన్నారు.

ఆయన.. పీసీసీ ‘చీప్‌’
బీజేపీ ఎంపీ ఒకడు.. కేసీఆర్‌, కేటీఆర్‌ బియ్యం స్మగ్లర్లు అంటడు.. వాడు మనిషా, పశువా? వాడిని ఏమనాలి? వాడికి తెలివి ఉన్నదా..? మెదడు మెకాళ్లలోకి జారిందా? ఇంకొకడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ‘చీప్‌’ అధ్యక్షుడు. ‘రేవంత్‌ చాలా చిల్లరగాడు.. మా ఏఐసీసీ ఇంచార్జి చిల్లరగానికి రూ.50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు’ అని వాళ్ల పార్టీ ఎంపీ కోమటిరెడ్డి అన్నడు. వాడిని చీఫ్‌ అనాల్నా.. చీప్‌ అనాల్నా? ఎంత చిల్లరగాడు అంటే.. కొత్తగా కడుతున్న సెక్రటేరియట్‌లో నేలమాళిగలు ఉన్నయని, ప్రగతి భవన్‌ నుంచి సెక్రటేరియట్‌కు కేసీఆర్‌ సొరంగం తవ్వి, వాటిని దోచుకుంటున్నారని మాట్లాడుతడు. మనిషి అనాల్నా ఏమి అనాలి?

సమస్యల పరిష్కర్త కేసీఆర్‌: కేకే
గతంలో నల్లగొండ జిల్లాకు వెళ్తే ఫ్లోరోసిస్‌ బాధితులే కనిపించేవారని, ఇప్పుడు ఆ సమస్యే లేకుండా పోయిందని పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు చెప్పారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కథానాయకుడు కేసీఆర్‌ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ త్రేతాయుగంలో దేవుళ్లు, రాక్షసులు ఉండేవారని, ఇప్పుడు కూడా దేవుడు లాంటి కేసీఆర్‌ ఉంటే రాక్షసుల్లాంటి ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పారు. పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహరావు మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, విప్‌ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి ఎల్‌ రమణ, కోలేటి దామోదర్‌గుప్తా, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌ గుప్తా, నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు పాల్గొన్నారు.

మేం గుజరాత్‌ గులాంలం కాదు
బీజేపీ వారికి మతం పేరుతో చిచ్చు పెట్టడం, విషం చిమ్మడం తప్ప మరే పని లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘గట్టిగా మాట్లాడితే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయడం, జైలుకు పంపుతం అనుడు, మీ ఉడుత ఊపులకు ఎవ్వడూ భయపడడు. మేం గుజరాత్‌ గులాంలం కాదు.. ఢిల్లీ బానిసలం కాదు’ అని హెచ్చరించారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ అంతు చూస్తా, రాజకీయ సమాధి చేస్తా అంటూ మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరన్నా తెలంగాణకు ఏం చేస్తారో, బీజేపీ ఏం చేసిందో చెప్పడంలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు బీజేపీలో చేరాలో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశం మీద ఎంతదాకైనా పోరాడుతామని చెప్పారు. కర్ణాటకలో అప్పర్‌ భద్రకు, ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారన్న కేటీఆర్‌.. తెలంగాణకు చెందిన ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వడంలేదన్న విషయంలో ఇక్కడి బీజేపీ ఎంపీలకు సోయిలేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఒక్కసారి కూడా ప్రస్తావన చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కి హిందూ, ముస్లింల మధ్య గొడవ పెట్టడం ఒక్కటే తెలుసని అన్నారు. ఎంపీ అయ్యాక ఒక్క పైసా అదనంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి తీసుకొచ్చాడా? అని ప్రశ్నించారు. గతంలోఎంపీగా ఉన్న బీ వినోద్‌కుమార్‌ ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం, నవోదయ విద్యాలయాల కోసం ప్రయత్నించారని గుర్తుచేశారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement