హనుమకొండ, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై.. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను అమాంతం పెంచాయి. 50కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర సగటున రూ.300, కొన్ని రకాల ఎరువులపై బస్తాకు ఏకంగా రూ.350 చొప్పున ధరలు పెరిగాయి. 20-20-0-13 కాంప్లెక్స్ బస్తా ధర కొన్ని రోజుల క్రితం రూ.1,500 నుంచి రూ.1,800కు పెరిగింది. తాజా పెంపుతో ఈ బస్తా ధర ఇప్పుడు రూ.2,150 అయ్యింది. యాసంగి సాగు ఇటీవలే ముగిసి, వడ్లు, మక్కజొన్నలను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు భారీగా పెంచడం వ్యవసాయరంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నది.
సాంకేతికంగా జూన్ నుంచి వానకాలం మొదవుతుంది. వర్షాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సాగు పనులు, పంటలను బట్టి ఎరువుల వినియోగం ఉంటుంది. అయితే సీజన్ మొదలయ్యే వరకు ఇంకా ఎన్నిసార్లు ధరలు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో ఎరువుల ధరల సమాచారం రైతులకు ఇంకా తెలియలేదు. సీజన్ ఆరంభంలో పెరిగిన ధరలను చూసి రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందే ప్రమాదం ఉన్నదని ఎరువుల డీలర్లు చెబుతున్నారు. ధరలు అమాంతంగా పెరుగడం వల్ల రైతులకు పెట్టుబడి ఇబ్బందులుంటాయని, ఎరువుల కొనుగోలు తగ్గి.. పంటల దిగుబడులు తగ్గుతాయని అంటున్నారు. కేంద్రం అమలుచేస్తున్న ఎరువుల సబ్సిడీ విధానంతో రైతులపై ఎరువుల భారం ఏటా పెరుగుతున్నది. యూరియా మినహా మిగతా ఎరువులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ స్థిరంగా ఉంటున్నది. ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కంపెనీలు రైతులకు విక్రయించే ధరలను పెంచుకొనేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముడిసరుకులు, దిగుమతి ఖర్చుల పేరిట కంపెనీలు పదేపదే ఎరువుల ధరలను పెంచుతున్నాయి. తాజాగా పశ్చిమాసియా యుద్ధం పేరుతో కొద్దిరోజుల్లోనే రెండుసార్లు పెంచాయి. వానకాలం మొదలయ్యేలోపు ఇంకెన్నిసార్లు ధరలు పెరుగుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
పంటల సంరక్షణలో కీలకమైన ఎరువుల ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడికి తగినట్టు పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో, రైతు అవసరాన్ని అదునుగా తీసుకొని వ్యాపారులు కనీస మద్దతు ధర కంటే మూడు నాలుగు వందలు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీని వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం వడ్లు, మక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మక్కజొన్న, వరి కోతలు పూర్తయ్యి నెల దాటుతున్నా ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదు. కేంద్రాల నిర్వహణ సరిగా లేక పంటల కొనుగోలుకు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. వానకాలం దగ్గరపడుతుండటం, అకాల వానల ప్రమాద హెచ్చరికలతో రైతులు పంటలను వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. అదీగాక నిరుడు వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంట చేతికందే సమయంలో లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందలేదు. దీనికితోడు యూరియా కొరత రైతులను నట్టేట ముంచింది. ఈసారైనా ఆ నష్టాన్ని కొంతమేర పూడ్చుకుందామనుకున్న రైతులకు.. పెరిగిన ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి.
