న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం వేతనంతో కూడిన 100 రోజుల పనిదినాలను కల్పించేందుకు చట్టపరమైన భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA-నరేగా) రద్దు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (PM Modi) నిర్ణయించుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. ఈ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్)(VB-G Ram G) పేరిట కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానున్నది. పనిదినాలను 100 నుంచి 125కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కోసం 40 శాతం నిధులు భరించేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నది.
బిల్లు ప్రకారం కేంద్రం, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఖర్చును 60ః40 నిష్పత్తిలో పంచుకుంటాయి. అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీరుతోసహా ఈశాన్య, హిమాలయన్ రాష్ర్టాలు మాత్రం 10 శాతం నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. మిగిలిన 90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. అంతేగాక ఈ పథకం అమలును సమీక్షించేందుకు, పర్యవేక్షించేందుకు, పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్, రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిళ్లు చట్టం కింద ఏర్పడతాయి. ఇవిగాక కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో స్టీరింగ్ కమిటీలు కూడా ఏర్పడతాయి. వ్యవసాయ పనులు చురుకుగా జరుగుతున్న కాలాలలో ఈ పథకం అమలును నిలిపివేసే అధికారం రాష్ర్టాలకు లభిస్తుంది. వ్యవసాయ కూలీల లభ్యతను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ వెసులుబాటును రాష్ర్టాలకు కల్పిస్తోంది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి కూడా ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించేందుకు తగిన పనుల్లో వారికి కూడా ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కూలీ రేట్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
రోజువారీ నిరుద్యోగ భృతి..రాష్ర్టాలపైనే భారం
దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపల ఉపాధిని కల్పించని పక్షంలో కూలీలకు రోజువారీ నిరుద్యోగ భృతిని చెల్లించాలన్న నిబంధనను ఈ బిల్లులో ప్రభుత్వం పునరుద్ధరించింది. నిరుద్యోగ భృతి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. మాస్టర్ రోల్లో పనిచేసే కూలీలకు మస్టర్ ముగిసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించని పక్షంలో 16వ రోజు నుంచి చెల్లించని వేతనాలపై ప్రతిరోజూ 0.05 శాతం నష్టపరిహారంతో వేతనాలను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపీలకు బిల్లు ప్రతులు
వికసిత్ భారత్@2047కు చెందిన జాతీయ దార్శనికతతో ముడిపడిన గ్రామీణాభివృద్ధి విధానాన్ని నెలకొల్పే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు ప్రతులను ప్రభుత్వం సోమవారం లోక్సభ సభ్యులకు పంపిణీ చేసింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ, 2005ని రద్దు చేసి వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్)(వీబీ-జీఆర్ఏఎంజీ) బిల్లు, 2025ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతి కుటుంబంలోని రైతులు, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 125 రోజుల వేతనంతో కూడిన పనిదినాలను కల్పించడానికి ఈ చట్టం భరోసా కల్పిస్తుందని బిల్లు పేర్కొంది. నరేగాను 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ నరేగాగా దీని పేరు మారింది.
గాంధీజీ పేరు తొలగింపు వెనుక ఆంతర్యమేంటి?
ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న నరేంద్ర మోదీ ప్రతిపాదనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఆమె ప్రశ్నించారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? ఈ దేశంలోనే కాక ప్రపంచంలో, చరిత్రలోనే గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరు. ప్రభుత్వం ఎందుకు ఈ పని చేస్తోందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆమె బిల్లుపై స్పందించారు.
ఉపాధి హామీ చట్టం ఆత్మను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని సీపీఎంకు చెందిన రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ప్రభుత్వం పంపిణీ చేసిన బిల్లుపై వ్యాఖ్యానించారు. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులో రాష్ర్టాలు 40 శాతం భరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన తప్పుపట్టారు. దీని వల్ల రాష్ర్టాలు ఏటా రూ. 50,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఒక్క కేరళ ప్రభుత్వమే అదనంగా రూ. 2,000-2,500 కోట్లు భరించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఖర్చును రాష్ర్టాలపై రుద్దడం సంస్కరణ కాదని, అది మోసమని ఆయన విమర్శించారు. ఇదో నయా ఫెడరిలజమని, రాష్ర్టాలు అధికంగా ఖర్చు చేస్తే ఆ ఘనత తమదేనని కేంద్రం చెప్పుకుంటుందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు.