హైదరాబాద్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటున్నాయని, ఇది మంచి పద్దతి కాదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఫెడరల్ స్పూర్తితో కేంద్రం, రాష్ర్టాలు తమ పరిధిలో నిర్వహించాల్సిన విధుల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నదన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాలని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కోరారు. కేంద్రానికి జీవం పోసేది రాష్ర్టాలేనని, రాష్ర్టాలు అభివృద్ధి పథంలో పయనిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అన్ని అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, కేంద్రం తోడ్పాటు నందిస్తే తెలంగాణ ఇంకా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించవద్దని, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. అంతకుముందు శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.