అఖిల భారత సర్వీస్ నిబంధనలను సవరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం అన్నివిధాలా సమర్థనీయమైనది. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ లేఖలో పేర్కొన్నట్టు సమాఖ్య స్ఫూర్తికి ఈ సవరింపు విరుద్ధమైనది. కేంద్రం అనుకుంటున్నట్టుగా నిబంధనల సవరణలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కేంద్రం డిప్యుటేషన్‌పై తీసుకోవచ్చు. ఈ సవరణలు అధికార బృందంపై కేంద్రం పూర్తి పట్టు సాధించడానికి ఉద్దేశించినవే. అధికార బృందం మొత్తం కేంద్రం అధీనంలోకి పోతే రాష్ర్టాల అధికారాలు నామమాత్రమవుతాయి. పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి విషయమై ఈ మధ్యనే వివాదం తలెత్తిన నేపథ్యంలో… రాష్ర్టాల హక్కులను హరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రయత్నిస్తున్నదని స్పష్టమవుతున్నది.
ఆర్థికరంగం, పరిపాలనా విధానాలు, రాజ్యాంగ నియమాలు, రాజకీయ విధానాలు- ఇట్లా అనేక రూపాల్లో రాష్ర్టాల హక్కులను మోదీ ప్రభుత్వం హరిస్తునే ఉన్నది. జీఎస్టీ వ్యవస్థ అనేదే రాష్ర్టాల హక్కులకు భంగకరమైనది. దీనిపై అనేక రకాలుగా నమ్మబలికిన కేంద్రం, ఆ తర్వాత హామీలను ఉల్లంఘించడమే కాకుండా, సెస్‌ల ద్వారా నిధులు సమీకరిస్తూ పన్నుల పంపకంలో రాష్ర్టాలకు మొండిచేయి చూపుతున్నది. 2017లో గుజరాత్‌లోని ఒక సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ- ప్రతిపక్షాలు పాలించే రాష్ర్టాలకు ఒక్కపైసా ఇవ్వనంటూ బెదిరించడం గమనార్హం. ప్రాజెక్టులపై రాష్ర్టాల హక్కులను హరించే చట్టాలు పార్లమెంటు ద్వారా చేయడం మరో తిరోగమన చర్య. విద్య తదితర అంశాల్లో రాష్ర్టాల హక్కులను గౌరవించడం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలను అనేక విధాలుగా బెదరగొట్టడం, తమ పార్టీ వారిచేత దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి రెచ్చగొట్టడం వంటి అనేక ఒత్తిళ్లను తేవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం రాష్ర్టాలకు అధికారాలుండాలని, సర్కారియా కమిషన్ సిఫారసులు అమలుచేయాలని డిమాండ్ చేసింది. కానీ మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పోకడలనే పుణికిపుచ్చుకున్నది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ రాష్ర్టాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలన్నారు. రాష్ర్టాల వ్యవహరాల్లోకి కేంద్రం తలదూర్చకూడదని అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవి చేపట్టిన కొత్తలో ‘సహకార సమాఖ్య’, ‘టీమ్ ఇండియా’ అంటూ సుద్దులు పలికారు. మరిప్పుడు ఆ మాటలన్నీ ఏమైనట్టు? డిప్యుటేషన్ పేరుతో ఐఏఎస్‌లపై పట్టు బిగించడం అంటే రాష్ర్టాల అధికారాలకు కత్తెర వేయడమే. రాష్ర్టాలను జిల్లాల స్థాయికి దిగజార్చడమే. భిన్న సంస్కృతులు గల బహుళ సమాజానికి అనుగుణంగా సమాఖ్య స్వరూపంగా రూపుదిద్దుకున్నప్పుడే దేశం అనిశ్చితికి తావులేకుండా, భద్రంగా ఉంటుంది. మోదీ కేంద్రీకృత పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం.