హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం మరోసారి వాణిజ్య బొగ్గు గనులను వేలం వేయనున్నది. ఈసారి ఇందుకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. గతంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ 10వ విడుత కోల్ బ్లాక్స్ వేలాన్ని మాత్రం ఇక్కడ చేపడుతున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం (ఈ నెల 21) దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు బ్లాక్‌లను మోదీ సర్కారు అమ్మకానికి తెస్తున్నది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ మీనాతోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎంఎస్టీసీ ప్లాట్‌ఫామ్‌పై వేలానికి సంబంధించిన వివరాలను పొందుపర్చారు. పర్సంటేజ్ రెవెన్యూ షేర్ మాడల్ ఆధారంగా ఆన్లైన్లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు. ఇక ఈ గనుల్లో కోకింగ్, నాన్-కోకింగ్ బొగ్గు బ్లాకులున్నాయి.
సింగరేణి పాల్గొనేనా..
ఈ బొగ్గు బ్లాక్‌ల వేలంలో సింగరేణి పాల్గొంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందా? లేదా? అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి నాడు వేలానికి దూరంగా ఉన్నది. కాగా, తెలంగాణలోని శ్రావణపల్లి బ్లాక్‌లో జీ-10 గ్రేడ్ బొగ్గు లభ్యమవుతుండగా, ఇక్కడ 119 మిలియన్ టన్నుల నిల్వలే ఉన్నట్టు తేల్చారు. దీంతో ఈ బ్లాక్పట్ల సింగరేణి ఆసక్తి చూపడం లేదు. ఆర్థికంగా అంత శ్రేయస్కరం కాదన్న భావనలో అధికారులున్నారు. ఇదే విషయంపై సింగరేణి సీఎండీ బలరాంను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా.. ఆర్థికంగా ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. తర్వాతే వేలంలో పాల్గొనాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తామన్నారు.
వేలాన్ని అడ్డుకుంటాం: రాజిరెడ్డి
బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకొని సింగరేణిని కాపాడుకుంటామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లతోపాటు ఇతర ఖనిజ నిల్వలను వేలం వేయకుండా కాపాడిన విషయాన్ని కార్మికులు గమనించాలని, ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టంచేశారు. వేలం వేస్తే ఇటీవల కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 20 వేల మంది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు.