Telangana Railway Projects | హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన తెలంగాణ ప్రాంతంలో అనేక కొత్త లైన్లు ప్రతిపాదనలకే పరిమితం కాగా, మూడో లైన్ ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్టు తయారైంది.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర రైల్వేల అభివృద్ధి కోసం ఎంతో కృషి జరుగగా, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కింది లేదు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్ట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికే పూర్తి కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు సిద్దిపేట వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా స్టేషన్లు సిరిసిల్ల, కరీంనగర్ వరకు రైల్వే లైను పనులు ఇంకా మొదలే కాలేదు. ఇక మనోహరాబాద్-కరీంనగర్ రైల్వేస్టేషన్ల మధ్య పూర్తిస్థాయి రైల్వే లైన్ ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుందో అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. అదే విధంగా డోర్నకల్-గద్వాల మధ్య కూడా కొత్త లైన్ కోసం ప్రతిపాదనలకే పరిమితమైంది. స్థానిక ప్రజాప్రతినిధుల పట్టించుకోక ముందుకు సాగడం లేదు.
ప్రస్తుతం ఏపీలో రైల్వేల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్తాయిలో దృష్టిసారించింది. అందులో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్(ఎస్సీవోఆర్) పేరుతో విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఎస్సీఆర్ జోన్లో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు విశాఖ జోన్ పరిధిలోకి వెళ్తాయి. కొనసాగింపుగా తెలంగాణలోని మధిర రైల్వేస్టేషన్ కూడా ఆ జోన్లో కలుపుతున్నారు. ఇప్పటికే మూడు డివిజన్లను ఎస్సీఆర్ కట్ చేయగా కొనసాగింపుగా మధిరను కూడా ఏపీకి తీసుకెళ్లడంతో స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు-విజయవాడ, కాజీపేట-విజయవాడ కారిడార్, హసన్పర్తి-రాఘవాపురం, ఆసిఫాబాద్-రేచిని రోడ్, మాకుడి-సిర్పూర్ టౌన్ వంటి పలు రైల్వేస్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్లు నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉన్నది. పనులు నత్తనడక సాగుతున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో మూడో లైను పనుల్లో పురోగతి కనిపించడం లేదు.