హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. యువశక్తిని వాడుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత్వాల వైఖరి వల్ల విసుగుచెందిన యువతలో చైతన్యం నింపేందుకు ఈ నెల 16,17వ తేదీల్లో హైదరాబాద్‌లో యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో యువజన సమ్మేళనం వాల్‌పోస్టర్‌ను జాన్‌వెస్లీ విడుదల చేశారు. రాష్ట్రంలో రాజకీయ అండదండలతోనే డ్రగ్స్ దందా సాగుతున్నదని విమర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయకపోగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నదని, అధికారం చేపట్టిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసిందనీ, గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లను క్లియర్ చేసి తన ఖాతాలో వేసుకుంటున్నదని వెల్లడించారు. నిరుద్యోగ భృతి హామీని బుట్టదాఖలు చేసిందని విమర్శించారు.