Job Application Fee | జాబ్ అప్లికేషన్ ఫీజు పెంపు 400%.. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్!
Job Application Fee | నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ. 200గా ఉన్న ఫీజును ఏకంగా వెయ్యికి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది.
Job Application Fee | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ. 200గా ఉన్న ఫీజును ఏకంగా వెయ్యికి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది.
కొత్తగా ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయగా, ఐదింటికి రూ. వెయ్యి ఫీజు విధించింది. బీసీ విద్యార్థులకు రాయితీ ఇవ్వలేదు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 ఫీజుగా తీసుకుంటున్నది. భారీగా ఫీజులు పెంచడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. నమ్మి ఓట్లేస్తే తమను నట్టేటముంచారని ఫైర్ అవుతున్నది. ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీస్తున్నది. ఉద్యోగాల భర్తీయేమో గానీ.. మా జేబులకు చిల్లులుపెడతారా? అంటూ మండిపడుతున్నది. పెంచిన ఫీజులను రూ. 200కు తగ్గించాలని, లేదా నిరుద్యోగులందరికీ ఉచితంగా దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. ఒకే తరహా పోస్టులు, ఒకే అర్హత గల పోస్టులకు కంబైన్డ్ నోటిఫికేషన్లు జారీచేయాలని కోరుతున్నది.
గతంలో రూ.200.. ఇప్పుడు వెయ్యి
కేసీఆర్ సర్కార్ హయాంలో ఉద్యోగాల దరఖాస్తు ఫీజు రూ. 200 మాత్రమే. నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో తక్కువగా తీసుకున్నారు. అంతేకాకుండా ఒకే విభాగానికి చెందిన పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్లు జారీచేశారు. కానిప్పుడు దరఖాస్తు ఫీజును ఏకంగా వెయ్యికి పెంచారు. అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో ఏండ్లుగా గదులు అద్దెకు తీసుకుని పూట గడవడమే కష్టంగా మారి, అప్పులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఫీజుల పెంపు గుదిబండలా మారింది. ఒకే అభ్యర్థి నాలుగైదు రకాల పోస్టులకు పోటీ పడాలంటే గతంలో రూ.వెయ్యి ఉండగా, ఇప్పుడు రూ. 5వేలు సమర్పించుకోవాల్సి వస్తున్నది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఫీజుల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడగలేక నిరుద్యోగ యువత సతమతమవుతున్నది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని కాంగ్రెస్ ఏకంగా అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఈ హామీని అటకెక్కించింది.

మినహాయింపులోనూ వివక్ష
టీజీపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లకు పరీక్ష ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు కింద రూ. 120 తీసుకునేవారు. ఈ పరీక్ష ఫీజు మినహాయింపులోనూ టీజీపీఎస్సీ వివక్ష ప్రదర్శించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్తోపాటు 18 నుంచి 44 ఏండ్ల లోపున్న రాష్ర్టానికి చెందిన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడేమో కేవలం నిరుద్యోగులకు మాత్రమే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఎక్స్ సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి చెందిన కొందరు పరీక్ష ఫీజు మినహాయింపునకు నోచుకోలేకపోతున్నారు. దీనిపైనా నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.
ఇదీ పరిస్థితి..
- తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దాదాపు 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు అండ్ ప్రాసెసింగ్ ఫీజుగా బీసీ, జనరల్ క్యాటగిరీ వారికి రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల నుంచి రూ. 500 ఫీజు వసూలు చేశారు. ఎగ్జామినేషన్ ఫీజుగా రూ. 80 తీసుకున్నారు. ఈ ఒక్క నోటిఫికేషన్‌కు ఫీజుల రూపంలో టీజీపీఎస్సీ ఖాతాలో రూ. 1.5కోట్లు వచ్చిపడ్డాయి.
- రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(సివిల్) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే శాఖలో 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(ఎలక్ట్రికల్), పీసీబీలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి కమిషన్ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది. ఈ అన్ని నోటిఫికేషన్లకు అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. వెయ్యి, (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500), ఎగ్జామినేషన్ ఫీజుగా రూ. 120 వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో జారీచేసే అన్ని నోటిఫికేషన్లకు ఇదే ఫీజు వసూలు చేయబోతున్నారు.
- గతంలో ఇంజినీరింగ్ విభాగం పోస్టులకు కామన్‌గా (ఒకే నోటిఫికేషన్) ఇచ్చేవారు. కానిప్పుడు విడివిడి.. ముక్కలు ముక్కలు చేసి నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు. అర్హతలున్న వారు రెండు, మూడు పోస్టులకు పోటీపడాలంటే రెండు, మూడు వేలు సమర్పించుకోవాల్సి వస్తున్నదని నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

