రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ స్థానిక సంస్థలు చేపట్టిన తీర్మానాల పరంపర కొనసాగుతోంది. కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా పరిషత్ ఇప్పటికే తీర్మానం చేయగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు సైతం ఇదే బాటపట్టాయి. చేసిన తీర్మాన ప్రతులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గోయల్‌కు లేఖల రూపంలో పంపుతున్నాయి. కేంద్రం చేస్తున్న మోసాన్ని చెప్పడం, వడ్లు కొనబోమన్న కేంద్ర వైఖరిని ప్రజల్లో ఎండగట్టడం, వడ్లు కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మరోవైపు టీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమైంది.
కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో వచ్చే వడ్లను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. సాధారణంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ తీస్తారు. కానీ, తమ వద్ద బాయిల్డ్ నిల్వలు పేరుకుపోయాయని కేంద్రం కుంటి సాకులు చెబుతోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్ర మంత్రి గోయల్ చెప్పడంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లగా, అక్కడ జరిగిన పరిణామాలను శనివారం జరిగిన కరీంనగర్ జడ్పీ సర్వ సభ్య సమావేశం వేదిక ద్వారా ప్రజలకు, రైతాంగానికి మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతులు పండించిన పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులపై తీవ్రమైన వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ప్రవర్తిస్తోందని, అదే ఉత్తరాది రాష్ర్టాల్లో ఏ పంట పండించినా ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయిస్తోందని మండిపడ్డారు. మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు జడ్పీ సర్వసభ్య సమావేశం రైతులకు అండగా నిలుస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏకగ్రీవ తీర్మానం చేసి,ప్రధాని మోదీకి పంపించింది.
పంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీల తీర్మానాలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకుంటే రైతుల పక్షాన టీఆర్ఎస్ మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమైన తర్వాత ఒక పక్క రైతులు నాట్లు వేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనబోమని స్పష్టం చేసింది. ఇది ఎలా సాధ్యమని అప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూ వస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరించినా స్పందన కరువైంది. చివరికి రాష్ట్ర మంత్రుల కమిటీ కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఆయన వైఖరిలో మార్పు కనిపించకపోగా తెలంగాణ ప్రజలను అవమాన పర్చే విధంగా మాట్లాడారని శనివారం జడ్పీ సర్వ సభ్య సమావేశంలో మంత్రి గంగుల వెల్లడించారు. ‘మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండి’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న తీర్మానాల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని, తెలంగాణ రైతుల పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మొత్తానికి కేంద్రం దిగి వచ్చే వరకు రైతుల పక్షాన మరో ఉద్యమానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, శంకరపట్నం ఎంపీపీ సరోజన అధ్యక్షతన జరిగిన ఆయా మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ తీర్మానాలు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండల పరిషత్ సర్వ సభ్యసమావేశం నిర్వహించి, ఎంపీపీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ముత్తారం మండలంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు అత్తె చంద్రమౌళి ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో గ్రామ సభ నిర్వహించి, తీర్మానం చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి, కొత్తపేట గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేశారు. కథలాపూర్ మండలంలోని సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి, పాలకవర్గ సభ్యులు, రైతులు, ప్రజలు తీర్మానించారు. కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోట నారాయణ అధ్యక్షతన తీర్మానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల ఆర్బీఎస్ అధ్యక్షడు కొమ్మేటి రాజిరెడ్డి అధ్యక్షతన రెడ్డి సంఘ భవనంలో జరిగిన సమావేశంలో రైతు బంధు సమితి తీర్మానం చేసింది. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు బంధు సమితి ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.