కొత్తపల్లి, మే 3: ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కేంద్రం అడ్డుకొంటున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి, ఆసిఫ్‌నగర్, నాగులమల్యాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం సేకరించిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, గన్నీ సంచుల కొరత అంటూ ప్రతిపక్షాల ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ధాన్యం సేకరణకు అవసరమైన 7.67 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 3,381 కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.