Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదల సమయంలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పాత్రను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, సినీ ప్రముఖులు కూడా స్పందించారు. తాజాగా ఆ వివాదంపై అర్షద్ వార్సీ మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. ఆ వివాదం తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. ఆ ట్రోలింగ్ తర్వాత నేను నాపై నేనే సెల్ఫ్ సెన్సార్ విధించుకున్నాను. ఇప్పుడు నాకు బాగా తెలిసిన స్నేహితుల మధ్య మాత్రమే సరదాగా మాట్లాడుతాను. తెలియని వాళ్ల ముందు జోక్స్ వేయడానికి కూడా ఆలోచిస్తాను. ఏ మాటైనా ఎలా తీసుకుంటారో తెలియదు అని తెలిపారు.
అయితే, సరదా వ్యాఖ్యలను కూడా కొన్నిసార్లు ప్రజలు మరీ సీరియస్‌గా తీసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు వివాదం ఎలా మొదలైంది అంటే.. 2024లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. అయితే సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఒక పోడ్కాస్ట్లో పాల్గొన్న అర్షద్ వార్సీ.. ప్రభాస్ పాత్రపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో ప్రభాస్ పాత్రను తాను వేరే విధంగా ఊహించుకున్నానని, తెరపై చూసిన తీరు తనకు నచ్చలేదని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వివాదంపై స్పందించారు. హీరో నాని ఒక సినిమా ప్రమోషన్ సందర్భంగా అర్షద్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించగా, దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం సంయమనంతో స్పందించారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అర్షద్ వార్సీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో పదాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. అలాగే ‘కల్కి’ తదుపరి భాగంలో ప్రభాస్ పాత్ర మరింత బలంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం అర్షద్ వార్సీ పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా ఉన్నారు. ఆయన చేతిలో స్పిరిట్, ఫౌజీ, కల్కి 2898 AD పార్ట్ 2, సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వం వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.