Rajkummar Rao | భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన అగ్రెసివ్ కెప్టెన్, ‘ప్రిన్స్ ఆఫ్ కలకత్తా’ సౌరవ్ గంగూలీ బయోపిక్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నేడు దాదా పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తూ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ” (Dada – The Sourav Ganguly Story) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో నటిస్తున్నారు. లార్డ్స్ మైదానం బాల్కనీలో గంగూలీ షర్ట్ విప్పి గాల్లో ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్న చారిత్రాత్మక ఐకానిక్ క్షణాన్ని గుర్తుచేసేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేయడం విశేషం.
ఈ సినిమాను విక్రమాదిత్య మోత్వానే డైరెక్ట్ చేస్తుండగా.. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్ మరియు DBL సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఒక సాధారణ క్రికెటర్ స్థాయి నుంచి ఇండియన్ క్రికెట్ మైండ్‌సెట్‌ను మార్చేసిన లీడర్‌గా దాదా ఎదిగిన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రాన్ని, 2027 మే 14న ఈద్ పండగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్‌తో పాటు క్రికెట్ ప్రపంచంలో కూడా ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.