హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కేంద్రం ఎంత బియ్యం కొంటుందో చెప్తే దానికి తగ్గట్టు రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. రైతులతో చర్చించి ఏయే పంటలు, ఎంతమేర వేయాలో సూచిస్తుంది. ఆ మేరకు విత్తనాలను సమకూర్చుతుంది. పంటల సాగుపై ఇది చిన్న లాజిక్. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ చిన్న లాజిక్‌ను కూడా గుర్తించకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుతూ, రాష్ట్రంపైనే నిందలు వేసేందుకు ప్రయత్నించారు.
కిషన్‌రెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల విత్తనాలను కూడా సమకూర్చటం లేదు.
వాస్తవం: తెలంగాణలో యాసంగిలో ఎక్కువగా వరి సాగు చేస్తారు. ఆ మేరకు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే కేంద్రం బాయిల్డ్ రైస్ కొనేది లేదని భీష్మించుకొని కూర్చున్నది. పోనీ, ముడిబియ్యం ఎంత కొంటదో చెప్పటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏ విత్తనాలను ఎంత మేర సిద్ధం చేయగలుగుతుంది?
కిషన్‌రెడ్డి: రాష్ట్రంలో నాసిరకం విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.
వాస్తవం: నకిలీ విత్తనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై పీడీయాక్ట్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటివరకు 70 మందికిపైగా పీడీయాక్ట్ కేసులు నమోదయ్యాయి.
కిషన్‌రెడ్డి: పంజాబ్‌లో కొంటాం.. తెలంగాణలో కొనం అని ఎవరన్నారు? పంజాబ్‌లో ఒకటే సీజన్‌కు ధాన్యం వస్తది.
వాస్తవం: పంజాబ్‌లో కొనుగోలు చేసిన పరిమాణంతో సమానంగా తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయటం లేదో చెప్పాలి. ఏడాదికి ఎంత కొంటరో చెప్పాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. వార్షిక టార్గెట్ ఎంతో చెప్పాలంటున్నది. దీనిపై సమాధానం చెప్పాలి.
కిషన్‌రెడ్డి: ఏ గ్రామంలో ఎంత పంట వేశారు? అని కొలిచే యంత్రాంగం, వ్యవస్థ కేంద్రం వద్ద లేదు.
వాస్తవం: సొంతంగా కొలిచే యంత్రాంగం లేదంటరు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే నమ్మరు. చివరికి శాటిలైట్ చిత్రాలు చెప్పాయంటూ 52 లక్షల ఎకరాలు సాగయిందని ఒప్పుకున్నరు.
కిషన్‌రెడ్డి: ఈ వానకాలంలో బాయిల్డ్ రైస్ ఇచ్చినా కొంటాం.
వాస్తవం: తెలంగాణలో యాసంగిలో మాత్రమే బాయిల్డ్ రైస్ పండుతుంది. వానకాలంలో వడ్లను బాయిల్ చేయాల్సిన అవసరమే లేదు. బాయిల్డ్ రైస్ పండే సీజన్లో కొనాలని కోరితే వద్దంటరు. ముడి బియ్యం వచ్చే సీజన్లో బాయిల్డ్ రైస్ కొంటామని హామీ ఇస్తరు. దీని వెనుక ఆంతర్యం ఏమిటి?