పెద్దేముల్, మార్చి 10 : చోరీ చేసిన ఓ సెల్‌ఫోన్‌ను విక్రయించే వ్యవహారం ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చురేపింది. ఓ స్నేహితుని దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని గొట్లపల్లి అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరులోని మల్రెడ్డిపల్లికి చెందిన ఓ బాలుడు, అంతారం గ్రామానికి చెందిన మరో బాలుడు, తాండూరులోని బస్వన్నకట్ట ప్రాంతవాసి ప్రశాంత్ స్నేహితులు. అంతారం ప్రాంత వాసితోపాటు ప్రశాంత్ (17)లు ఇద్దరు తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. ఈ నెల 8న ప్రశాంత్ కాలేజీలో పార్కింగ్‌లో ఓ సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ఈ మొబైల్‌ను ఎవరికైనా విక్రయించాలని ప్రశాంత్ సదరు స్నేహితులను పురమాయించాడు. వారు ఓ మొబైల్ షాప్‌కు వెళ్లగా.. ఫోన్‌ను పరిశీలించిన సదరు దుకాణ యజమాని ఈ ఫోన్ ఎక్కడిదని దబాయించాడు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించి అతడికి ఫోన్ చేసి విషయం చెప్పగా అతను వచ్చి వీరిద్దరిని చితకబాదాడు. దీంతో వీరిద్దరు ప్రశాంత్‌పై కక్ష పెంచుకొన్నారు. బుధవారం సాయంత్రం ఆ ఇద్దరు స్నేహితులు.. ప్రశాంత్‌ను భూకైలాస్ ఆలయం దగ్గరకు పిలిచి సెల్‌ఫోన్ విక్రయ విషయమై వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత రాత్రి బైపాస్ రోడ్డు మీదుగా ప్రశాంత్‌ను స్కూటీపై పెద్దేముల్ మండలంలోని గొట్లపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడా మరోమారు గొడవకు దిగారు. అందులో ఓ యువకుడు ప్రశాంత్ చెంపపై బలంగా కొట్టగా స్పృహతప్పి పడిపోయాడు. తరువాత ఇద్దరు కలిసి ఓ బండరాయితో ప్రశాంత్ తలపై పలుమార్లు బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత వారు తాండూరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిచ్చిన సమాచారం మేరకు గొట్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.