హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ):‘నిన్నటి పొరపాట్లను విశ్లేషించుకోవడం ద్వారా నేడు, రేపు వాటిని నివారించడం ఎలాగో మనం నేర్చుకుంటాం. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకోవడం రోగం రాకుండా టీకా తీసుకోవడం వంటిది. విప్లవోద్యమాన్ని కూడా అదే తీరుగా నడిపించగలుగుతాం. ఇది నల్లేరు మీద బండిలా సాగే పని ఎంతమాత్రం కాదు. తీవ్రమైన అధ్యయనం, ఓపికతో, త్యాగాలతో కూడిన విప్లవాచరణ’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీకి ఆయన 22 పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను సోమవారం విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉన్నదని, ఆయుధ పోరాటాలను తాతాలికంగా విరమించాలని ఆ లేఖలో కోరారు. దశాబ్దాల తరబడి తప్పుడు విధానాలే తీవ్రమైన నష్టాలకు కారణమని, ‘సైన్యం తప్ప రహస్య పార్టీ లేదు’ అని ఆయన ఖరాకండిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాతాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించి, ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లాలని ఆయన క్యాడర్‌ను కోరారు.
విప్లవోద్యమానికి 3 ప్రధాన లోపాలు..
పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిన మౌలికమైన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి సైన్యంతో ఉంటే సాధ్యం కాదని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘విప్లవపార్టీ లేకుండా విప్లవమే లేదు’ అనే లెనిన్ సూత్రాన్ని విస్మరించడం వల్ల, మావోయిస్టులకు సైన్యం తప్ప రహస్య పార్టీ లేని స్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతమున్న ఏసీ, డీవీసీ వంటి పార్టీ కమిటీలన్నీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వెంట, సైనిక దుస్తులలో సాయుధులుగా ఉండటం బహిరంగ రహస్యమేనని అన్నారు. వీటిని శత్రువుకు అబేధ్యమైన రహస్య పార్టీ నిర్మాణాలుగా పరిగణించలేమని, ఇదే బలహీనత శత్రువుకు పార్టీని నిర్మూలించేందుకు పూర్తి అవకాశాన్ని ఇచ్చిందని పేరొన్నారు.
బేస్ ఏరియా నిర్మాణం తప్పుడు నిర్ణయం..
2007లో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో దండకారణ్యం (డీకే), బీహార్-జార్ఖండ్‌లలో బేస్ ఏరియాలను నిర్మించే కేంద్ర కర్తవ్యాన్ని చేపట్టడం రెండో వ్యూహాత్మక తప్పిదమని వేణుగోపాల్ విమర్శించారు. పార్టీ బలాన్ని అతిగా అంచనా వేసి, శత్రువు బలాన్ని తకువ చేసి చూశామన్నారు. 2011 నుండే కిందిస్థాయి కామ్రేడ్స్ ఈ తప్పును సరిదిద్దుకోవాలని కోరినప్పటికీ, సీసీ పట్టించుకోలేదని అన్నారు. ఒక దశాబ్దం పాటు నష్టపోయామని తెలిపారు. ఇప్పటికైనా అమరుల రక్తతర్పణం నుండి గుణపాఠాలను తీసుకుందామని పేర్కొన్నారు.
చట్టబద్ధ పోరాటాలను విస్మరించడం
రహస్య, చట్టబద్ధ పోరాటాల మధ్య సమన్వయాన్ని కొనసాగించడంలో సెంట్రల్ కమిటీ పూర్తిగా విఫలమైందని ఇది మూడో తప్పిదమని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. 2006 నూతన అటవీ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చే భూమి పట్టాలను ‘బేస్ ఏరియాలు నిర్మిస్తున్నామనే ధీమాతో’ వ్యతిరేకించాం. దండకారణ్యంలోని రైతులకు మన జనతన సరార్లే పట్టాలిస్తాయని చెప్పాం, కానీ ఆ పట్టాలకు వ్యవస్థలో గుర్తింపు లేదనే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను విస్మరించామని తెలిపారు. ప్రజలు తమ జీవితావసరాల కోసం అనివార్యమైన ఆధార్ కార్డులు తెచ్చుకోవడాన్ని కూడా పార్టీ వ్యతిరేకించడం, ప్రజలు దొంగచాటుగా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి వాటిని పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేరొన్నారు. ‘ఇప్పుడు మనకు సానుకూల మార్పు కావాలి. ఉద్యమాన్ని కాపాడుకోవడం, క్యాడర్‌ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుదాం. నూతన పద్ధతులలో పురోగమిద్దాం. అంతిమ విజయం ప్రజలదే’ అంటూ మల్లోజుల తన లేఖను ముగించారు.
నాయకత్వంపై విమర్శ, క్షమాపణలు..
తాను కేంద్ర కమిటీలో 28 ఏండ్లు, పొలిట్ బ్యూరోలో 18 ఏండ్లు సభ్యుడిగా ఉన్నట్టు మల్లోజుల తెలిపారు. ప్రస్తుతం ఉద్యమం ఎదురొంటున్న వైఫల్యాలకు, భారీ నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ, యావత్ పార్టీ క్యాడర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇంతటి నష్టాలకు దారితీసిన నాయకత్వంలో కొనసాగడానికి అనర్హుడిని అని ప్రకటించారు. గతంలో దివంగత ప్రధానకార్యదర్శి కామ్రేడ్ బసవరాజు (నంబాల కేశవరావు) కూడా ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించారని, ఏప్రిల్ 2025 నాటికి ఈ నిర్ణయం అనివార్యమని భావించారని గుర్తు చేశారు.