శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 : కంచ గచ్చిబౌలి భూముల వీడియోలు, ఫొటోల విషయంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ రెండోసారి గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగింది. అనంతరం బయటకు వచ్చిన క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ విచారణ పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని వాపోయారు. మొదటిసారి విచారణలో 60 ప్రశ్నలు అడిగిన పోలీసులు.. రెండోసారి 8 గంటల పాటు పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టి ఒక్క ప్రశ్న కూడా అడగలేదని చెప్పారు. ఓ విచారణాధికారి సెలవు మీద ఉండగా, ఒకరు ఢిల్లీకి వెళ్లారని, మరొకరు అందుబాటులో లేరని తెలిసిందన్నారు. ఓ వైపు రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉండగా, పోలీసులు విచారణ పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1లో పక్కపక్కన కూర్చున్న 684 మంది అభ్యర్థులకు సేమ్ మార్కులు వచ్చాయని, ఒకరి తర్వాత ఒకరు కూర్చున్న 702 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు వచ్చాయని, అసలైన విచారణ వాటిమీద చేయాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూ భూముల్లో బుల్డోజర్లతో బిజీగా ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సైతం మాట్లాడారు. మరి ప్రధాని మీద కూడా కేసుపెట్టి విచారణకు పిలుస్తారా?’ అని క్రిశాంక్ ప్రశ్నించారు. ఈ నెల18న 3వ సారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారని, వీకెండ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇష్టంలా ఉన్నదని, ఇండ్లు కూల్చాలన్నా, చెట్లు నరకాలన్నా వీకెండ్లోనే చేస్తున్నదని ఎద్దేవాచేశారు. వరుస కోర్టు సెలవులను చూసుకుని విచారణకు పిలుస్తున్నారని, అయినా బెదిరే ప్రసక్తే లేదని, చట్ట పరంగా విచారణకు హాజరవుతానని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విచారణలో సెల్ఫోన్లు వాడడం చట్టవిరుద్ధమని తెలిసినా ఫోన్లు వాడుతున్నారని, సెలవుల్లో, వీకెండ్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.