Kamareddy | సోషల్‌మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొంతమంది విపరీతమైన పనులు చేస్తున్నారు. వాటితో ఇతరులను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. తాజాగా కామారెడ్డిలో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ కావాలని ఆత్మహత్య చేసుకుంటానని భావోద్వేగంగా ఓ వీడియో పెట్టాడు. అది చూసి కంగారుపడిన పోలీసులు పరుగులు తీయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణానికి చెందిన రెడ్లాన్ రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ కావాలని.. తన వీడియోలకు ఎక్కువ వ్యూస్, లైక్‌లు రావాలని అనుకున్నాడు. ఇందుకోసం విపరీతమైన ఆలోచన చేశాడు. తనకు బతకాలని లేదని.. ఆత్మహత్య చేసుకుంటానని భావోద్వేగంగా మాట్లాడుతూ ఒక వీడియో రూపొందించి, దాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.
రోహిత్ అనుకున్నట్లుగానే ఆ వీడియో తొందరగానే వైరల్ అయ్యింది. ఆ వీడియో కామారెడ్డి పట్టణ సీఐ నరహరి దృష్టికి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. సదరు యువకుడిని కాపాడి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఉరుకుల పరుగుల మీద అతని ఇంటికి వెళ్లారు. అసలేమైందని రోహిత్‌ను ఆరా తీయగా.. అసలు విషయం తాపీగా చెప్పాడు. వ్యూస్, లైక్‌ల కోసమే ఆ వీడియో పెట్టానని.. నిజంగా తాను ఆత్మహత్య చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు ఆగ్రహానికి గురయ్యారు. విలువైన సమయాన్ని, వనరులను వృథా చేశాడనే కారణంపై రోహిత్‌పై కేసు నమోదు చేశారు.