Pocso Case | పోక్సో కేసులో ఓ మహిళకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఒంగోలులో బాలిక పట్ల అసహజంగా ప్రవర్తించిన కేజీబీవీ ప్రత్యేకాధికారిణికి ప్రకాశం జిల్లా ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం.. 2018లో ఓ విద్యార్థిని పట్ల అదే విద్యాలయంలో ప్రత్యేకాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. బాలికను భయపెట్టి తన గదిలోకి తీసుకెళ్లి.. పోర్న్ వీడియోలు చూపించేది. అవి చూసి ఏడుస్తుంటే కొట్టి తనతో అసభ్యంగా వ్యవహరించింది. ఆ వేధింపులు తాళలేక బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో అదే ఏడాది జూన్ 26వ తేదీన మర్రిపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. తాజాగా ఆమెపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలుశిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.